
ఇక డ్రానే!
భారత్-ఇంగ్లాండ్ ల మధ్య రాజ్ కోట్ లో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 114 పరుగుల చేసిన ఇంగ్లాండ్ 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కుక్(46), హసీబ్ హమీద్(62) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఉత్తమ ఆటతీరును కనబరిచిన ఇంగ్లాండ్ 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 488 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కేవలం ఒకే రోజు ఆట మిగిలివుండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా తొలిటెస్టులో ఇప్పటికే ఇంగ్లాండు తరఫు నుంచి మూడు సెంచరీలు, భారత్ తరఫు నుంచి రెండు సెంచరీలు నమోదయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ల దూకుడు చూస్తుంటే మరో రెండు సెంచరీలు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతకుముందు 319-4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్లలో రవిచంద్రన్ అశ్విన్(70) మినహా మిగతా ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ కు మూడు వికెట్లు దక్కగా, మొయిన్ అలీకి రెండు, జాఫర్ అన్సారీకి ఒక వికెట్ దక్కింది.