
'బంగ్లాను ఓడించడం అంత సులువు కాదు'
ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా నేరుగా వచ్చిన రెండే రెండు జట్లలో ఒకటి మన టీమిండియా. అలాంటి జట్టు.. బంగ్లాదేశ్ లాంటి పసికూనను ఓడించడానికి ఆలోచించాలా? అసలు వాళ్లను ఓడించడం అంత సులభం కాదని అంటున్నారు.. అలనాటి దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్. బంగ్లాదేశ్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, మహ్మదుల్లా ఎలాంటి ఆటనైనా తీసుకెళ్లిపోతాడని, ముష్ఫికుర్ రహీం, షకీబ్ కూడా మేజిక్ చేయగలరని అన్నారు. వాళ్లు ముందు బ్యాటింగ్ చేసి, 250 పరుగుల వరకు చేస్తే.. తర్వాత వాళ్ల బౌలింగులో ఆ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం భారత్కు అంత సులభం కాదని గవాస్కర్ చెప్పారు.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మనోళ్లకు నిజమైన పరీక్ష ఎదురైందని, మనవాళ్లు గెలవాలనే ఆశిస్తున్నా.. అదయితే అందరూ అనుకుంటున్నంత సులభం కాదని చెప్పారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదని, అందువల్ల అక్కడ మరీ ఎక్కువగా సిక్సర్లు కొట్టే అవకాశం ఉండదని అన్నారు. వాతావరణం కాస్త మబ్బుగా ఉండి.. బాల్ తిరిగిందంటే.. బ్యాటింగ్ అంత సులభంగా ఉండదని సన్నీ చెప్పారు. ఇలాంటి పరిస్థితి భారత జట్టుకు కూడా అనువుగా ఉండొచ్చన్నారు.