![India Football Player Chuni Goswami Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/1/Chuni.jpg.webp?itok=JkS1qOB1)
కోల్‌కతా: భారత విఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు చునీ గోస్వామి కన్నుమూశారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల మాజీ సారథి కోల్‌కతాలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మేటి ఫుట్‌బాలరే కాదు... క్రికెటర్ కూడా! ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీల్లో ఆయన బెంగాల్ తరఫున ఆడారు. కాలేజీ రోజుల్లో ఆయన కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు ఆడటం విశేషం. 1962లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ను విజేతగా నిలిపిన ఈ కెప్టెన్ మరో రెండేళ్ల తర్వాత ఆసియా కప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చి రన్నరప్‌గా నిలిపాడు. కొంతకాలంగా ఆయన అధిక మధుమేహం, ప్రొస్టేట్, తీవ్రమైన నరాలకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబసభ్యులు నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే గుండెపోటు రావడంతో సాయంత్రం 5 గంటలకు చునీ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆడినంత కాలం మోహన్ బగన్‌కే ఆడిన ఈ స్టార్ 1957లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత అలనాటి మేటి ఆటగాళ్లలో ఒకరైన చునీ 27 ఏళ్ల వయసులోనే 1964లో ఆటకు గుడ్‌బై చెప్పారు. అయితే ఈ ఆటకు బై చెప్పినా... మరో ఆటలో బిజీ అయ్యారు. క్రికెట్‌లోనూ మెరిసిన గోస్వామి 1966లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సుబ్రోతో గుహతో కలిసి గ్యారీ సోబర్స్ ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కంబైన్డ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగిన గోస్వామి 8 వికెట్లు తీశాడు. 1971–72 సీజన్‌లో చునీ బెంగాల్ రంజీ జట్టుకు సారథ్యం వహించగా... జట్టు ఫైనల్లోకి చేరింది. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో తృప్తిపడింది.
Comments
Please login to add a commentAdd a comment