
ప్రాక్టీస్ సరిపోతుందా!
బెనోని: ఒక వైపు వన్డేల్లో పరాభవం...మరో వైపు వణికిస్తున్న దక్షిణాఫ్రికా పేసర్లు...బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా అంతంత మాత్రమే. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు పరిస్థితి ఇది. ఈ నేపథ్యంలో టెస్టులకు ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌ను టీమిండియా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సి ఉంది. తొలి టెస్టు జరిగే జొహన్నెస్‌బర్గ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో సహారా విల్లోమూర్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు రోజుల మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్విటేషన్ ఎలెవన్‌తో భారత్ తలపడుతుంది. అనధికారిక మ్యాచ్ కావడంతో 12 మంది ఆటగాళ్లు కూడా బరిలోకి దిగే సౌకర్యం ఉంది. రిటైర్డ్‌హర్ట్ అయ్యి ఎక్కువ మందికి ప్రాక్టీస్ అవకాశం కల్పించాలనేది జట్టు ఆలోచన. టాస్ గెలిచి సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని భారత్ భావిస్తోంది.
ఆ ఇద్దరే కీలకం...
టెస్టు సిరీస్‌లో భారత్ విజయావకాశాలు ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. బ్యాట్స్‌మన్‌గా చతేశ్వర్ పుజారా ఎంతో కీలకం కానున్నాడు. వన్డేలు ఆడని పుజారా తనదైన టెక్నిక్‌తో టెస్టుల్లో ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంది. ముఖ్యంగా దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత అతని బాధ్యత మరింత పెరిగింది. సీనియర్ పేసర్ జహీర్ పునరాగమనంలో ఏ మాత్రం ప్రభావం చూపిస్తాడన్నది ఆసక్తికరం. యువ పేసర్లకు అతను మార్గదర్శిగా నిలవాల్సిన నేపథ్యంలో జహీర్‌కు కూడా బౌలింగ్ ప్రాక్టీస్ అవసరం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత బ్యాటింగ్ మొత్తం తడబడింది. తొలి వన్డేలో ధోని అర్ధ సెంచరీని మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు. కాబట్టి ప్రధాన బ్యాట్స్‌మెన్ ధావన్, కోహ్లి, రోహిత్ శర్మలకు ఈ మ్యాచ్‌తో ప్రాక్టీస్ ఎంతో ముఖ్యం. వన్డేలు ఆడని విజయ్ కూడా రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బట్టే తొలి టెస్టులో భారత్ అనుసరించబోయే వ్యూహంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భారత్ ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడాలని భావిస్తే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాయుడు, రహానేలకు కూడా బ్యాటింగ్ అవకాశం దక్కవచ్చు. ముఖ్యంగా సచిన్ రిటైర్మెంట్ అనంతరం నాలుగో స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారో తేలిపోనుంది. ఇషాంత్, షమీ, ఉమేశ్‌లు కూడా ఎర్ర బంతితో తమ లయను అందుకోవాలంటే ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలి. అయితే నాలుగు రోజుల మ్యాచ్ కాకపోవడంతో భారత్ బ్యాట్స్‌మెన్, బౌలర్లలో ఎంత మందికి తగినంత ప్రాక్టీస్ లభిస్తుందో చూడాలి. మరో వైపు ఇన్విటేషన్ ఎలెవన్‌లో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు ఎవరూ లేరు. ఐపీఎల్ ఆడే క్రిస్ మోరిస్ మినహా గుర్తింపు పొందిన క్రికెటర్లు ఎవరూ ఈ మ్యాచ్ ఆడటం లేదు.
జట్ల వివరాలు:
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, కోహ్లి, రోహిత్, రాయుడు, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఓజా, జహీర్, ఇషాంత్, ఉమేశ్, భువనేశ్వర్, షమీ.
సౌతాఫ్రికా ఇన్విటేషన్ ఎలెవన్: స్టీఫెన్ కుక్ (కెప్టెన్), బవుమా, బిర్క్, హార్మర్, హెండ్రిక్స్, రీజా, ఎడ్డీ లీ, మోరిస్, రోసూ, యాసీన్, వాన్ జిల్, విలస్, విలోజెన్.
బ్యాటింగ్ పిచ్‌తో ‘దెబ్బ’
టెస్టు మ్యాచ్‌లకు ముందు భారత జట్టుకు ఉన్న ఒకే ఒక్క ప్రాక్టీస్ అవకాశం రెండు రోజుల మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. సాధారణంగా బ్యాటింగ్ వికెట్ ఉంటే మంచిదేగా అనుకోవచ్చు. కానీ అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి పేస్, బౌన్స్‌తో ఉన్న చక్కటి బౌలింగ్ వికెట్లు సిద్ధం చేస్తూ... అలాంటి వికెట్లపై ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేకుండా చేసింది దక్షిణాఫ్రికా బోర్డు.
మరోవైపు బెనోనీలోని ఈ మైదానం రెండో శ్రే ణికి చెందినది. ఇక్కడ సరైన సౌకర్యాలు ఉండవు. వర్షం పడితే మైదానం సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుంది. గత వారం రోజులుగా ఇక్కడ క్రమం తప్పకుండా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం ఈ రెండు రోజుల మ్యాచ్ పూర్తిగా ఆడే అవకాశం దక్కుతుందా అనేది కూడా సందేహమే. మొత్తానికి భారత జట్టుకు సరైన సన్నాహకాలు లేకుండా చేయడంలో దక్షిణాఫ్రికా బోర్డు విజయం సాధించింది.
కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి
‘పచ్చిక, బౌన్స్ ఉండే దక్షిణాఫ్రికా వికెట్లపై రాణించాలంటే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి. సీమ్ బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేయడం ఇక్కడ చాలా ప్రధానం. మొదట మన బౌలింగ్‌పై నమ్మకం పెట్టుకోవాలి. ఆ తర్వాత నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలి. ఏ జట్టైనా ఎక్కడ రాణించాలన్నా కచ్చితంగా దీన్ని పాటించి తీరాలి. గతంలో ఇక్కడ ఆడినప్పుడు దీన్ని అమలు చేశాం. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తాం.
జట్టులోకి పునరాగమనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కచ్చితంగా కొత్త ప్రయాణం. వన్డేల్లో ఫీల్డింగ్ నిబంధనలు బౌలర్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. అయితే టెస్టుల విషయానికొస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌పై దృష్టిపెట్టా. వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది దోహదపడుతుంది. తర్వాత టెస్టుల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. స్మిత్‌ను అవుట్ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. ఆరంభంలో వికెట్లు తీయడం చాలా కీలకం. జట్టు గాడిలో పడేందుకు ఇది ఉపయోగపడుతుంది’
- జహీర్ ఖాన్ (భారత పేసర్)
మూలాలకు కట్టుబడాలి: పుజారా
‘మూలాలకు కట్టుబడి బ్యాటింగ్ చేయడం ప్రధానం. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతున్నప్పుడు కచ్చితంగా పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సిందే. ఎవరు వేగంగా వేస్తారనేది ఇక్కడ ముఖ్యం కాదు. అయితే ఇక్కడి బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మాకు కాస్త కొత్తగా ఉన్నాయి. యువ ఆటగాళ్లు క్రికెట్‌లో ఎదగాలంటే సవాళ్లను అధిగమించాలి. చాలా అంశాలు నేర్చుకోవాలి. ప్రొటీస్ టూర్ మాకు ఓ సవాలు. దీనికి మేం బాగానే సిద్ధమయ్యాం. బౌన్స్‌కు కాస్త సర్దుబాటు చేసుకోక తప్పదు. ఎక్కడ ఆడినా బ్యాటింగ్ యూనిట్ మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఒకరిద్దరి ఫామ్‌పై ఆధారపడొద్దు. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది’
టెస్టుల్లో పోరాడతాం: అశ్విన్
‘వన్డేల్లో విఫలమైనా టెస్టుల్లో మాత్రం గట్టిగానే పోరాడతాం. వన్డే సిరీస్ నుంచి చాలా సానుకూల అంశాలను నేర్చుకున్నాం. టెస్టుల్లో రాణించేందుకు ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉన్నారు. సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. విదేశాల్లో సిరీస్ గెలవడం చాలా ప్రధానమైంది. జహీర్‌పై అధిక ఒత్తిడి లేదు.’