
భారత్‌కు 2 స్వర్ణాలు
తైపీ సిటీ: ఆసియా గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మూడో అంచె మీట్‌లోనూ భారత అథ్లెట్స్ రాణించారు. ఆదివారం జరిగిన ఈ మీట్‌లో భారత అథ్లెట్స్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 400 మీటర్ల విభాగంలో కేరళకు చెందిన మొహమ్మద్ అనస్ యాహియా... పురుషుల షాట్‌పుట్‌లో హరియాణా క్రీడాకారుడు ఓంప్రకాశ్ సింగ్ కర్హానా పసిడి పతకాలను గెల్చుకున్నారు. అనస్ 400 మీటర్ల రేసును 45.69 సెకన్లలో పూర్తి చేశాడు. ఓంప్రకాశ్ ఇనుప గుండును 19.58 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ (11.52 సెకన్లు–సీజన్ బెస్ట్)... 800 మీటర్ల విభాగంలో టింటూ లుకా (2ని:03.97 సెకన్లు–సీజన్ బెస్ట్)... పురుషుల 800 మీటర్ల విభాగంలో జిన్సన్ జాన్సన్ (1ని:51.35 సెకన్లు)... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ (17.38 మీటర్లు–సీజన్ బెస్ట్) రజత పతకాలు సాధించారు. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (79.90 మీటర్లు), మహిళల 400 మీటర్ల విభాగంలో పూవమ్మ (53.11 సెకన్లు) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. ఇంతకుముందు ఆసియా గ్రాండ్‌ప్రి తొలి అంచెలో భారత అథ్లెట్స్ ఏడు పతకాలు, రెండో అంచెలో ఆరు పతకాలు సాధించారు.