పారిస్: ఒలింపిక్స్‌లో కనీస అంచనాలను అందుకోలేకపోయిన భారత మహిళల, పురుషుల జట్లు 4*400 మీటర్ల రిలే ఈవెంట్లలో నిరాశపరిచి హీట్స్‌లోనే వెనుదిరిగాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, విత్యా రాంరాజ్, పూవమ్మ రాజు, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల జట్టు హీట్స్‌లో పోటీపడ్డ ఎనిమిది జట్లలో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.
భారత బృందం 3 నిమిషాల 32.51 సెకన్లలో రేసును పూర్తి చేసి చివరి స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా విత్యా రేసును ఆరంభించి 53.46 సెకన్ల తర్వాత బ్యాటన్‌ను జ్యోతిక శ్రీకి అందించింది. జ్యోతిక శ్రీ వాయువేగంగా పరుగెత్తి 51.30 సెకన్ల తర్వాత బ్యాటన్‌ను పూవమ్మ రాజుకు అందించింది. పూవమ్మ 54.80 సెకన్ల తర్వాత శుభకు బ్యాటన్ ఇచ్చింది.
శుభ 52.95 సెకన్లలో 400 మీటర్లను పూర్తి చేసింది. ఈ నలుగురిలో జ్యోతిక శ్రీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అనస్, అజ్మల్, అమోజ్, రాజేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3 నిమిషాల 00.58 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా భారత బృందం పదో స్థానాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment