ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులకు త్రుటిలో చేజారిన పలు పతకాలు
చిక్కినట్లే చిక్కి చేజారితే కలిగే బాధ వర్ణణాతీతం! ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై పతకం పట్టాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. ఏళ్ల తరబడి కఠోర సాధన, అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు. మరి అలాంటిది... మెడల్‌కు అత్యంత చేరువైన తర్వాత అందినట్లే అంది ఆ విజయం దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు!
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబుతాకు ఇలాంటి మనసు వికలమయ్యే అనుభవం ఎదురైంది. అయితే త్రుటిలో పతకాలు చేజార్చుకున్న భారత ప్లేయర్లలో అర్జున్ బబూతా మొదటి క్రీడాకారుడేమీ కాదు... గతంలోనూ పలుమార్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పరిశీలిస్తే...
ఫుట్‌బాల్‌తో మొదలు
1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ శిక్షణలో రాటుదేలిన మన జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఆతిథ్య ఆ్రస్టేలియాపై నెవిల్లె డిసౌజా హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో సెమీస్‌లో అడుగుపెట్టి పతకం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే యుగోస్లో వియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 1–4తో పరాజయం పాలైంది. కాంస్య పతక పోరులోనూ తడబడ్డ భారత్ 0–3తో బల్గేరియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో నిరాశగా వెనుదిరిగింది.
మిల్కా సింగ్ వెంట్రుకవాసిలో...
1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో సమీప ప్రత్యరి్థని చూసే క్రమంలో క్షణకాలాన్ని వృథా చేసుకున్న మిల్కా.. దానికి జీవితకాల మూల్యం చెల్లించుకున్నాడు. రోమ్ ఒలింపిక్స్ అనుభవంతో అథ్లెటిక్స్‌కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతి బలవంతంగా అతడిని తిరిగి ట్రాక్ ఎక్కించగా.. 1962 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటాడు.
మహిళల హాకీలో ఇలా..
1980 మాస్కో విశ్వ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్‌పై ఆతిథ్య సోవియట్ యూనియన్ దాడి చేసిన నేపథ్యంలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాస్కో క్రీడలను బహిష్కరించాయి. దీంతో మన జట్టు పోడియంపై నిలవడం ఖాయమే అనిపించింది. ఆ్రస్టియా, పోలాండ్‌పై ఘనవిజయాలు సాధించిన మన మహిళల జట్టు పతకంపై ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. చెకోస్లోవియా, సోవియట్ యూనియన్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
పరుగుల రాణికి తీరని వ్యథ!
1984 లాస్‌ఏంజెలిస్ క్రీడల్లో పరుగుల రాణి పీటీ ఉషకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతు తేడాతో పీటీ ఉష నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా ఒక భారత అథ్లెట్ పతకం కోల్పోయిన అత్యల్ప తేడా ఇదే. ఫైనల్లో ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది.
జాయ్‌దీప్‌కు నిరాశ
2012 లండన్ ఒలింపిక్స్‌లో జాయ్‌దీప్ కర్మాకర్‌కు అర్జున్‌లాంటి అనుభవమే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన కర్మాకర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చి ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే తుదిపోరులో కాంస్యం గెలిచిన షూటర్ కంటే.. 1.9 పాయింట్లు వెనుకబడిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
దీపా కర్మాకర్ త్రుటిలో...
2016 రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్యం గెలిచిన జిమ్నాస్ట్‌కు దీపా కర్మాకర్‌కు మధ్య 0.150 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే క్రీడల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నాడు.
మహిళల హాకీ జట్టు మరోసారి
2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు. 1980 మాస్కో క్రీడల్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న మహిళల జట్టు.. టోక్యోలోనూ అదే బాటలో నడిచింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆ్రస్టేలియాను మట్టికరిపించి ఆశలు రేపిన మన అమ్మాయిలు.. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలయ్యారు.
కాంస్య పతక పోరులోనైనా అద్భుతం చేస్తారనుకుంటే.. ఇంగ్లండ్‌తో పోరులో ఆరంభంలో ఆధిక్యం సాధించినా.. చివర్లో పట్టు విడిచి 3–4తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది.
ఈసారి ఇద్దరు..
2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్–మహేశ్ భూపతి జంట నాలుగో స్థానంలో నిలిచింది. భారత అత్యుత్తమ ద్వయంగా విశ్వక్రీడల బరిలోకి దిగిన పేస్–భూపతి హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో 6–7, 6–4, 14–16తో అన్‌సిచ్–లుబిసిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment