పారిస్: ఈ ఒలింపిక్స్ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి... అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్‌కే తలమానికమైన ‘ఈఫిల్ టవర్’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే... ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు.
ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే... ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్‌ను కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్‌కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన ఈ టవర్‌ను నవీకరణ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడు టవర్‌లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఓ రహస్య గదిలో జాగ్రత్త పరిచారు.
ఈసారి ఒలింపిక్స్ పారిస్‌లో జరుగనున్నాయి. కాబట్టి తమ పతకాలతో మరో విశిష్టత కల్పించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పతకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాల్ని (భద్రపరిచిన ఇనుప ముక్కలు) వినియోగించారు. ఈసారి విజేతలంతా అదృష్టవంతులే! ఎందుకంటే వాళ్లంతా పతకాల్నే కాదు... ‘సింబల్ ఆఫ్ పారిస్’ గుర్తుల్ని తమతమ దేశాలకు మోసుకెళ్తారు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ క్రియేటివ్ డైరెక్టర్ థీయెరి రిబోల్ మాట్లాడుతూ ‘కచ్చితంగా అథ్లెట్లకు ఇది సువర్ణావకాశం.
పారిస్ జగది్వఖ్యాత చిహ్నం అవశేషాల్ని ఒలింపిక్స్ విజేతలు తమతో తీసుకెళ్లొచ్చు’ అని అన్నారు. విశ్వక్రీడల చరిత్రలోనే చెరగని ముద్ర వేసేందుకు విశేషమైన వినూత్నమైన ఆలోచనతో ఈ పతకాల్ని డిజైన్ చేశామని చెప్పారు. విజేతలకు అందించేందుకు మొత్తం 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలు తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment