హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ దినేశ్ ముదియన్‌సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్‌లో హనే... మహిళల టి47 లాంగ్‌జంప్ ఈవెంట్‌లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు.
కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని
పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment