‘ఫాంటమ్ లింబ్ పెయిన్’... కృత్రిమ కాలు అమర్చుకున్న వారిలో దాదాపు అందరికీ వచ్చే సమస్య. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే పరిస్థితి... కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతుంటే ఆ బాధ తట్టుకోవడం కష్టం! సాధన సమయంలో సుమిత్ అంటిల్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. కానీ తాను పారాలింపిక్స్‌లో పాల్గొనాలనే, పతకం సాధించాలనే లక్ష్యం నుంచి మాత్రం అతను తప్పుకోలేదు. ‘ప్రొస్థెటిక్ లెగ్’తోనే జావెలిన్‌లో ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం అతను తన కలను నిజం చేసుకున్నాడు. టోక్యోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.
2015 జనవరి 5 వరకు సుమిత్ జీవితం చాలా మందిలాగే సరదాగా సాగింది. హరియాణాలో గల్లీ గల్లీలో కనిపించే చాలా మందిలాగే రెజ్లింగ్ వైపు వెళ్లాడు. నాలుగైదేళ్లు పెద్దగా ఫలితాలు లేకపోయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతను ‘పహిల్వాన్’ కావాలనే కోరుకోవడంతో ఆటను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 17 ఏళ్ల వయసులో ట్యూషన్ నుంచి తిరిగొస్తూ జరిగిన ఒక ప్రమాదం సుమిత్ జీవితాన్ని మార్చేసింది. మోటార్ బైక్‌పై వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్‌తో అతను తన ఎడమ కాలును కోల్పోయాడు. మోకాలి కింది భాగం మొత్తం తొలగించాల్సి రాగా... 53 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. కృత్రిమ కాలు బిగించడంతో ఇక లోకమంతా విషాదంగా, ఏదో కోల్పోయినట్లుగా కనిపించింది.
దాంతో ఇంటికే పరిమితమైన అతను పాత జ్ఞాపకాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ స్టేడియం వైపు మరలాడు. అదే సుమిత్ జీవితాన్ని మార్చింది. సోనెపట్ సమీపం లోని తన సొంత ఊరు ఖేవ్డాకు చెందిన ఒక పారాథ్లెట్ అతనికి పరిచయమయ్యాడు. అంతే... పారా క్రీడల గురించి మొత్తం తెలుసుకున్న అతను మళ్లీ ఆటల్లో కొత్త జీవితం వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. అథ్లెటిక్స్‌లో, అందులోనూ జావెలిన్ త్రోలో సత్తా చాటగలనని నమ్మకంతో సాధన మొదలుపెట్టిన సుమిత్ ఒక్కసారిగా దూసుకుపోయాడు. 2019లో వరల్డ్ పారా అథ్లెటిక్స్, వరల్డ్ గ్రాండ్‌ప్రి, పారిస్ ఓపెన్‌లలో అతను మూడు రజతాలు సాధించి సత్తా చాటాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా, వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనతతో టోక్యో బరిలోకి దిగిన సుమిత్ రాణించి విశ్వ క్రీడల్లో భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించగలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment