ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్వర్ణ పతకం గెలిచిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌ను ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఘనంగా సత్కరించారు. అతడి కోసం ఇస్లామాబాద్‌లో మంగళవారం విందు ఏర్పాటు చేసిన ఆయన.. నదీమ్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కఠిన సవాళ్లతో సావాసం చేయాల్సి వచ్చినా దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నదీమ్ నిరూపించాడని కొనియాడారు.
రెండో అత్యున్నత పురస్కారం
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) చెక్కును ప్రధాని షరీఫ్ నదీమ్‌కు అందించారు. అదే విధంగా.. పాకిస్తాన్‌లోని రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును నదీమ్‌కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ పసిడి పతక వీరుడి పేరిట ఇస్లామాబాద్‌లోని జిన్నా స్టేడియంలో అర్షద్ నదీమ్ హై పర్ఫామెన్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
దీనితో పాటు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో పాక్ కరెన్సీలో ఒక బిలియన్ రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కాగా నదీమ్ కుటుంబంతో పాటు అతడి కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌ను కూడా ప్రధాని ప్రశంసించారు. అతడి కూడా పాక్ కరెన్సీలో కోటి రూపాయలు నజరానా ఇస్తున్నట్లు తెలిపారు.
నదీమ్‌కు కారు 92.97
పంజాబ్ (పాక్) ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) నదీమ్ స్వగ్రామానికి వెళ్లి మరీ ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. వారి కుటుంబసభ్యులతో ముచ్చటించిన ఆమె ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసిన కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌కూ రూ. 50 లక్షల (రూ.15 లక్షలు) చెక్ ఇచ్చారు.
ఈ నెల 8న పారిస్‌లో జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో నదీమ్.. భారత హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా (89.45 మీటర్లు; రజతం)ను వెనక్కినెట్టి 92.97 మీటర్లతో కొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు. ఈ ఒలింపిక్ రికార్డు స్కోరుతో కూడిన నేమ్ ప్లేట్ ఉన్న కారును కూడా నదీమ్‌కు ఈ సందర్భంగా బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment