పారిస్ పారాలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్... బంగారు పతకాన్ని నిలబెట్టుకునేందుకు తనకిష్టమైన మిఠాయిలకు దూరమైనట్లు వెల్లడించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్... తాజా పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.
సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో సుమిత్ జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం సుమిత్ మాట్లాడుతూ... ‘పారాలింపిక్స్ కోసం 10 నుంచి 12 కేజీల బరువు తగ్గా. అధిక బరువు వల్ల శరీరంపై ఒత్తిడిపడి మెరుగైన ప్రదర్శన చేయలేనని ఫిజియో సూచించడంతో నాకు ఇష్టమైన స్వీట్లు తినడం మానేశా.
ఒత్తిడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టోక్యో సమయంలో నాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకపోయింది. వంద శాతం ఫిట్‌నెస్‌తో లేకుండానే పారిస్ పోటీల్లో పాల్గొన్నా. గాయం భయంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నా... స్వదేశానికి చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుంటా’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment