నూటికి 99శాతం వరల్డ్ కప్ టీమిండియాదే!
టీమిండియా ఎదురులేకుండా దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న ధోనీ సేన తాజాగా ఆసియా కప్‌లోనూ ఇదే నిరూపించింది. ఏమాత్రం తొణకకుండా ఆసియా కప్ సాధించి.. రానున్న ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో తామే ఫేవరెట్ టీమ్ అని చాటింది. ఈ నేపథ్యంలో నూటికి 99శాతం ధోనీ సేననే పొట్టి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే అవకాశముందని భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ధోనీ నేతృత్వంలో పర్ఫెక్ట్ విన్నింగ్ కాంబినేషన్ తో జట్టు ఉందని, ధోనీ నేతృత్వంలో రెండోసారి టీ-20 వరల్డ్ కప్ ట్రోఫీని టీమిండియా అందుకోవడం ఖాయంగా కనిపిస్తోందని సెహ్వాగ్ అంచనా వేశాడు.
టీమిండియా జోరు చూస్తే.. టీ-20లో వరల్డ్ కప్‌లో మన జట్టే ఫేవరెట్ అని స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొత్తం 11 టీ-20 మ్యాచులు ఆడిన టీమిండియా పదింటిలో ఘనవిజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ వంటి జట్లను చిత్తు చేస్తూ తన సత్తా చాటింది. తాజాగా ఆసియా కప్ ఫైనల్‌లోనూ ధోనీ సేన ధనాధన్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం మంచి బ్యాలెన్స్‌తో టీమిండియా వరల్డ్ కప్‌లోకి ఎంటరవుతున్నదని, ప్రపంచంలోని అన్ని జట్ల కన్నా మేటిగా టీమ్ కూర్పు ఉందని మరోవైపు ధోనీ కూడా స్పష్టం చేశాడు. దీంతో భారీ అంచనాల మధ్య టీమిండియా వరల్డ్ కప్‌లోకి ఎంటరవుతుండటం అభిమానుల్లో ఆశలు పెంచుతోంది.