లండన్: కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్, ఆర్చరీ ఈవెంట్ల కోసం బెట్టు వీడని పోరాటం చేసిన భారత్ ఒకింత విజయం సాధించినట్లే! భారత్‌కు ఈ రెండు ఈవెంట్లను ప్రత్యేకంగా నిర్వహించుకునే స్వేచ్ఛనిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) అందులో సాధించిన పతకాలను గేమ్స్ పట్టికలో తర్వాత చేరుస్తామని ప్రకటించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు బర్మింగ్‌హామ్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు ఆతిథ్యమివ్వనుంది. అయితే అతిథ్య దేశానికి ఉన్న సౌలభ్యం మేరకు ఇంగ్లండ్ రోస్టర్ విధానంలో భాగంగా షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను గేమ్స్ నుంచి తప్పించింది.
దీనిపై గుర్రుగా ఉన్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గేమ్స్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. కొన్ని నెలలుగా ఈ అంశం సీజీఎఫ్‌లో రగులుతూనే ఉంది. ఎట్టకేలకు దీనికి ముగింపు పలికే నిర్ణయాన్ని తాజా సీజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో తీసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందుగా ఆ రెండు క్రీడల్ని భారత్‌లో నిర్వహించాలని, అందులో సాధించిన పతకాల్ని ప్రధాన గేమ్స్ పట్టికలో ఓ వారం తర్వాత చేరుస్తామని సీజీఎఫ్ తెలిపింది. షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను 2022 జనవరిలో నిర్వహిస్తామని ఐఓఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment