
భారత్‌కు చావో...రేవో
ఆక్లాండ్: వన్డే క్రికెట్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడాక... భారత్ ఎప్పుడూ సిరీస్ గెలవలేదు. ప్రపంచ క్రికెట్‌లో రెండు జట్లు (2003లో పాక్‌పై దక్షిణాఫ్రికా; 2005లో జింబాబ్వేపై బంగ్లాదేశ్) మాత్రమే సాధించిన ఈ ఫీట్‌ను... న్యూజిలాండ్‌లో చావో... రేవో పరిస్థితిని ఎదుర్కొంటున్న ధోనిసేన అందుకుంటుందా? ఇక ఈ సిరీస్ గెలవాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడాలి.
ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య కీలకమైన మూడో వన్డే నేడు ఆక్లాండ్‌లో జరగనుంది. సిరీస్‌కు ముందు ప్రయోగాలు చేయబోనని చెప్పిన ధోని కనీసం ఇప్పుడైనా రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లు శుభారంభం అందించడంపైనే భారత్ విజయం ఆధారపడి ఉంది. అయితే విదేశీ గడ్డపై గత నాలుగు మ్యాచ్‌ల్లో ధావన్, రోహిత్ ఘోరంగా విఫలమయ్యారు. చివరి రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరు కలిపి 67 పరుగులే చేశారు.
ప్రాక్టీస్ సెషన్‌లో రైనా మోచేతికి గాయమైంది. దీంతో రాయుడుకు తుది జట్టులోకి చోటు ఖాయంగా కనిపిస్తోంది.
కోహ్లి, ధోనిలకు చివర్లో సహకారం అందించే బ్యాట్స్‌మెన్ లేకపోవడం లోటు.
నాలుగో స్థానానికి ప్రమోట్ అవుతున్న రహానే భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది.
ఆల్‌రౌండర్‌గా జడేజా జట్టులోకి వచ్చినా బ్యాటింగ్‌లో మెరవలేకపోతున్నాడు. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా లక్ష్య ఛేదనలో కీలక సమయంలో వికెట్ చేజార్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
గత ఐదు మ్యాచ్‌ల్లో అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతని స్థానంలో మిశ్రా, బిన్నిలలో ఒకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది. కానీ ధోని అశ్విన్‌ను తీస్తాడా?
స్లాగ్ ఓవర్లలో విఫలమవుతున్న ఇషాంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అతని స్థానంలో ఆరోన్‌కు చాన్స్ ఇస్తారా? లేదా? చూడాలి.
బౌన్సీ వికెట్ కావడం, మైదానం భిన్నమైన రీతిలో ఉండటం వల్ల పరుగులు నిరోధించడం కష్టమవుతుంది. స్ట్రయిట్ బౌండరీ కంటే స్క్వేర్ లెగ్ బౌండరీ దూరంగా ఉంది.
మళ్లీ టాప్ ర్యాంక్‌లో భారత్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ మళ్లీ నంబర్‌వన్‌కు చేరుకుంది. నాలుగో వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడటం ధోనిసేనకు కలిసొచ్చింది. ప్రస్తుతం భారత్ 117, ఆసీస్ 116 పాయింట్లతో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.