ఎదురులేని భారత్ | India in the final of the Junior Asia Cup hockey | Sakshi
Sakshi News home page

ఎదురులేని భారత్

Published Sun, Nov 22 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

ఎదురులేని భారత్

ఎదురులేని భారత్

సెమీస్‌లో జపాన్‌పై 6-1తో గెలుపు
 నేడు పాకిస్తాన్‌తో టైటిల్ పోరు
 
 క్వాంటన్ (మలేసియా): ప్రత్యర్థి ఎవరైనా దూకుడైన ఆటతీరుతో అదరగొడుతోన్న భారత యువ హాకీ జట్టు జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 6-1 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం కనబరిచారు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే జోరును నాకౌట్ దశలోనూ పునరావృతం చేసింది.

ఆట 12వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. తర్వాతి నిమిషంలోనే మన్‌ప్రీత్ జూనియర్ చేసిన గోల్‌తో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పది నిమిషాల తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చడంతో భారత్ 3-0తో ముందంజ వేసింది. 27వ నిమిషంలో విక్రమ్‌జీత్ సింగ్ గోల్ చేయడంతో విరామ సమయానికి భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ తన జోరును కొనసాగించింది. 48వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్, 64వ నిమిషంలో వరుణ్ కుమార్ ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున 44వ నిమిషంలో షోటా యమాదా ఏకైక గోల్ సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘షూటౌట్’లో 8-7తో దక్షిణ కొరియాను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేలోపు రెండు జట్లు 2-2తో సమఉజ్జీగా నిలిచాయి. విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్‌లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement