
దుబాయ్: టెస్టుల్లో భారత నంబర్‌వన్ ర్యాంకు మరింత పదిలమైంది, పటిష్టమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో టీమిండియా ఎవరికీ అందనంతగా 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 2015–16, 2016–17 సీజన్‌లలో కోహ్లి సేన ఇంటాబయటా సాధించిన చిరస్మరణీయ విజయాలతో భారత్‌కు 50 శాతం వెయిటేజీ కలిసొచ్చింది. దీంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (112) కంటే 13 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో టాప్‌ర్యాంకును పటిష్టం చేసుకుంది టీమిండియా.
ఏప్రిల్ 3తో ముగిసిన కటాఫ్ తేదీతో ఇరు జట్లు టాప్–2 ర్యాంకులతో వరుసగా రూ. 6.67 కోట్లు (1 మిలియన్ డాలర్లు), రూ. 3.34 కోట్లు (5 లక్షల డాలర్లు) అందుకోనున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా (106) మూడోస్థానానికి ఎగబాకినప్పటికీ... కటాఫ్ తేదీ వరకు న్యూజిలాండ్ (102; ప్రస్తుతం నాలుగో ర్యాంకు) టాప్–3లో ఉండటంతో రూ. కోటి 33 లక్షలు (2 లక్షల డాలర్లు) నజరానాకు అర్హత పొందింది. ఈ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ (9వ)ను బంగ్లాదేశ్ (8వ) అధిగమించింది. టెస్టు ర్యాంకుల చరిత్రలో విండీస్ అథమ స్థానానికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ జట్టు కేవలం జింబాబ్వే కంటే మాత్రమే ముందుంది.
Comments
Please login to add a commentAdd a comment