
ఒలింపిక్స్ రేసులో భారత్ లేదు
ఊహాగానాలకు తెరదించిన ఐఓసీ చీఫ్ {పధానితో భేటీ
న్యూఢిల్లీ: 2024 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి ప్రదర్శిస్తుందంటూ వచ్చిన ఊహాగానాలకు తెర పడింది. ప్రధాని న రేంద్ర మోదీ నుంచి ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం ప్రధానితో సమావేశమయ్యారు. ఏడాది క్రితమే సస్పెన్షన్ తొలగించుకున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తుందనుకోవడం తొందరపాటు ఆలోచనే అవుతుందని పేర్కొన్నారు. ప్రధానిని కలుసుకోవడానికి ముందు బాచ్... ఐఓఏ అధికారులతో, క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. క్రీడా బిల్లుపై తమ వ్యతిరేకతను ప్రధానికి తెలపాలని ఐఓఏ అధికారులు బాచ్‌ను కోరారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.
2024 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేస్తుందని మీడియాలో వచ్చిన కథనాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ప్రధాని దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చాను. అయితే మేం ఇది తొందరపాటుగానే భావించాం. ఎందుకంటే ఐఓఏ గతేడాదే సస్పెన్షన్ నుంచి బయటకు వచ్చింది. ఇంకా పటిష్టంగా నిలవాల్సి ఉంది.
బిడ్ సాధ్యాసాధ్యాలపై ప్రధానిని అడిగాను. ఈ గేమ్స్ కోసం తాము సర్వసన్నద్ధంగా ఉండడంతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.
దేశంలో క్రీడల అభివృద్ధి కోసం కోచింగ్, సాంకేతికత, క్రీడా పాలకులకు.. కోచ్‌లకు శిక్షణ తదితర అంశాల్లో తోడ్పడేందుకు కేంద్రం, ఐఓఏ, ఐఓసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నా పర్యటనతో దేశంలో క్రీడలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.
ఐఓఏ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామని ప్రధాని నాతో చెప్పారు. కేంద్రం, ఎన్‌ఓసీలు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళతాయని భావిస్తున్నాను.భవిష్యత్‌లో భారత్ క్రీడాపరంగా సూపర్ పవర్‌గా మారితే ఐఓసీ సంతోషిస్తుంది. దీనికోసం మేం సహకరిస్తాం.
దేశంలో 80 మిలియన్ల ముంది యువతే ఉంది. వీరికి క్రీడల్లో నైపుణ్యాన్ని అందిస్తే అద్భుతం జరుగుతుంది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో అథ్లెట్లు రాణించాలంటే కేంద్రం, ఐఓఏ సంయుక్తంగా వారికి మంచి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.