భారత్‌కు మూడో విజయం
చెంగ్డూ (చైనా): పతకం నెగ్గే అవకాశాలు చేజారినా... ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 3.5-0.5 పాయింట్ల తేడాతో పోలండ్‌పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 46 ఎత్తుల్లో మోనికా సోకోపై నెగ్గగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 35 ఎత్తుల్లో జొలాంతా జవాద్జకాతో ‘డ్రా’ చేసుకుంది.
మేరీ ఆన్ గోమ్స్ 44 ఎత్తుల్లో మార్తా బార్తెల్‌పై, సౌమ్య స్వామినాథన్ 41 ఎత్తుల్లో కరీనా హౌరోస్కాపై గెలిచారు. మంగళవారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ఆర్మేనియాతో భారత్ ఆడుతుంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఆర్మేనియా చేతిలో ఓడిపోయింది. హరికృష్ణ, శశికిరణ్, సేతురామన్ గేమ్‌లు ‘డ్రా’ కాగా, విదిత్ ఓడిపోయాడు.