the third victory
-
భారత్‌కు మూడో విజయం
చెంగ్డూ (చైనా): పతకం నెగ్గే అవకాశాలు చేజారినా... ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 3.5-0.5 పాయింట్ల తేడాతో పోలండ్పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 46 ఎత్తుల్లో మోనికా సోకోపై నెగ్గగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 35 ఎత్తుల్లో జొలాంతా జవాద్జకాతో ‘డ్రా’ చేసుకుంది. మేరీ ఆన్ గోమ్స్ 44 ఎత్తుల్లో మార్తా బార్తెల్పై, సౌమ్య స్వామినాథన్ 41 ఎత్తుల్లో కరీనా హౌరోస్కాపై గెలిచారు. మంగళవారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆర్మేనియాతో భారత్ ఆడుతుంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఆర్మేనియా చేతిలో ఓడిపోయింది. హరికృష్ణ, శశికిరణ్, సేతురామన్ గేమ్‌లు ‘డ్రా’ కాగా, విదిత్ ఓడిపోయాడు. -
పంకజ్‌కు మూడో గెలుపు
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ బెంగళూరు: తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘హెచ్' లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-0 (103-4, 119-7, 56-26, 136-0) ఫ్రేమ్‌ల తేడాతో పాల్ ష్కాఫ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. హైదరాబాద్ ప్లేయర్ లక్కీ వత్నాని వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్కీ 4-3 (14-65, 30-75, 86-22, 65-43, 46-54, 88-0, 65-22) ఫ్రేమ్‌ల తేడాతో నొబ్రెస్ (బ్రెజిల్)ను ఓడించాడు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మొత్తం 16 గ్రూప్‌ల నుంచి నలుగురు చొప్పున 64 మంది నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు.