క్లీన్‌స్వీప్‌ చేజారింది | India lost in the third day | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌ చేజారింది

Published Sun, Feb 11 2018 1:36 AM | Last Updated on Sun, Feb 11 2018 1:36 AM

India lost in the third day - Sakshi

దీప్తి శర్మ

పోచెఫ్‌స్ట్రూమ్‌: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావించిన మిథాలీ సేనకు నిరాశ ఎదురైంది. చివరిదైన మూడో వన్డేలో సఫారీలు ఏడు వికెట్లతో భారత్‌ను ఓడించారు. మొదట భారత్‌ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ కాగా... దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేనకు ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజృంభించిన స్మృతి మంధాన... ఈసారి దక్షిణాఫ్రికా పేసర్‌ షబ్నమ్‌ ఇస్మాయిల్‌ (4/30) వేసిన తొలి బంతికే వెనుదిరిగింది.

ఆ తర్వాత మరో ఓపెనర్‌ దీప్తి శర్మ (112 బంతుల్లో 79; 8 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (64 బంతుల్లో 56; 8 ఫోర్లు) రాణించడంతో జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (35 బంతుల్లో 25; 4 ఫోర్లు), శిఖా పాండే (16 బంతుల్లో 31 నాటౌట్‌; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (4) విఫలమైంది. అనంతరం దక్షిణాఫ్రికా డు ప్రీజ్‌ (111 బంతుల్లో 90 నాటౌట్‌; 7 ఫోర్లు), లారా వోల్వార్ట్‌ (88 బంతుల్లో 59; 4 ఫోర్లు), కెప్టెన్‌ నికెర్క్‌ (30 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించడంతో నాలుగు బంతులు మిగిలుండగానే 241 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్‌ జులన్‌ గోస్వామి బరిలోకి దిగలేదు. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్‌ 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement