బలమే బలహీనతగా మారిన వేళ...
మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం
266 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం
స్పిన్నర్ మొయిన్ అలీకి ఆరు వికెట్లు
1-1తో సిరీస్ సమం
నాలుగో టెస్టు గురువారం నుంచి
ఈ ఓటమికి బ్యాట్స్‌మెన్ కారణం. నలుగురు బౌలర్ల వ్యూహంపై పునరాలోచించాలి. ధావన్, విజయ్, రోహిత్‌లతో ఐదో బౌలర్ స్థానాన్ని భర్తీ చేయొచ్చని అనుకున్నాం. కానీ మేం అనుకున్నట్లు జరగలేదు. ఈ ఓటమిని సమీక్షించుకుని తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవుతాం’
- ధోని
వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుందంటే... భారత్ ప్రత్యర్థి ఎవరైనా వణికిపోవాల్సిందే..!
కానీ ఇక్కడ సీన్ మారింది. మొయిన్ అలీ లాంటి సాధారణ స్పిన్నర్ చేతిలో భారత్ ఓడిపోయింది.వికెట్‌ను అంచనా వేయలేక అశ్విన్‌ను వదిలేసిన భారత్... సిరీస్‌పై పట్టు సాధించే అపూర్వ అవకాశాన్ని చేజార్చుకుంది.
తొలి రోజు నుంచే ఆత్మరక్షణ ధోరణిలో ఆడిన ధోనిసేన... ఇంగ్లండ్‌కు విజయాన్ని పువ్వుల్లో పెట్టి అందించింది. ఏడాది నుంచి గెలుపు లేక, అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కోలేక అల్లాడిపోతున్న ఇంగ్లండ్‌కు... భారత యువ జట్టు కొత్త ఊపిరి పోసింది. లార్డ్స్‌లో సంచలన విజయంతో ఊరించిన ధోనిసేన... వారంలోనే ఉస్సూరుమనిపించింది.
సౌతాంప్టన్: అద్భుతాలేమీ జరగలేదు. మూడో టెస్టులో నాలుగో రోజు ముగిసేసరికే భారత్ ఓటమి ఖాయమైనా... కనీసం ధోనిసేన పోరాడుతుందేమో అని ఆశించినా.... నిరాశే మిగిలింది. ఆఖరి రోజు గురువారం ఉదయం సెషన్‌లో రెండు గంటలలోపే మిగిలిన ఆరు వికెట్లు పడిపోయాయి. 24.4 ఓవర్లలో 66 పరుగులు జోడించి... మొత్తం 178 పరుగులకు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటయింది. దీంతో ఇంగ్లండ్ 266 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ (6/67) ధాటికి భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రహానే (121 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) ఒక్కడే అజేయ అర్ధసెంచరీతో పోరాడాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నాలుగో టెస్టు గురువారం నుంచి జరుగుతుంది. ఇంగ్లండ్ 10 టెస్టుల తర్వాత ఓ మ్యాచ్ గెలిచి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. అండర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రెండు గంటల్లోపే...
చివరి రోజు ఆట మొదలుపెట్టిన భారత్ కాసేపటికే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. అండర్సన్ బౌలింగ్‌లో రోహిత్ (6) నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఒక ఫోర్ కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన ధోని (6) అండర్సన్ బౌలింగ్‌లోనే బట్లర్‌కు క్యాచిచ్చి వెనుదిరిగాడు.
ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేశారు. రహానే, జడేజా వీరి జోరును కాసేపు అడ్డుకున్నారు. అయితే ఏడో వికెట్‌కు 32 పరుగులు జోడించాక.. జడేజా (15) అలీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అప్పటి నుంచి అలీ జోరు కొనసాగింది. భువనేశ్వర్‌ను డకౌట్‌గా వెనక్కి పంపిన అలీ.. షమీ (0)ని కూడా అవుట్ చేశాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. తనదైన శైలిలో ఆడిన అజింక్యా రహానే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక పంకజ్ సింగ్ రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించినా.. అలీ బౌలింగ్‌లోనే చివరి బ్యాట్స్‌మెన్‌గా పెవిలియన్ చేరాడు. చివరి రోజు 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి భారత వెన్ను విరిచిన అలీ మొత్తం మీద రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం అతనికిదే ఇదే తొలిసారి.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 569/7 డిక్లేర్డ్
భారత్ తొలి ఇన్నింగ్స్: 330 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 205/4 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 12; ధావన్ (సి) జోర్డాన్ (బి) రూట్ 37; పుజారా (సి) జోర్డాన్ (బి) అలీ 2; కోహ్లి (సి) బట్లర్ (బి) అలీ 28; రహానే నాటౌట్ 52; రోహిత్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 6; ధోని (సి) బట్లర్ (బి) అండర్సన్ 6; జడేజా (బి) అలీ 15; భువనేశ్వర్ (సి) అండర్సన్ (బి) అలీ 0; షమీ (బి) అలీ 0; పంకజ్ (బి) అలీ 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (66.4 ఓవర్లలో ఆలౌట్): 178.
వికెట్ల పతనం: 1-26; 2-29; 3-80; 4-89; 5-112; 6-120; 7-152; 8-152; 9-154; 10-178.
బౌలింగ్: అండర్సన్ 14-5-24-2; బ్రాడ్ 13-6-22-0; వోక్స్ 11-3-23-0; అలీ 24.4-4-67-6; జోర్డాన్ 5-0-22-0; రూట్ 2-0-5-1; బ్యాలెన్స్ 1-0-5-0.