దక్షిణాఫ్రికా ప్రపోజల్ కు బీసీసీఐ ఓకే!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది తమతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేందుకు భారత పురుషుల జట్టుతో మహిళల జట్టును కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలన్న ఆ దేశ క్రికెట్ బోర్డు అభ్యర్ధనకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరు క్రికెట్ బోర్డుల ఒప్పందంలో భాగంగా విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా వచ్చే సంవత్సరం జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
ఈ ద్వైపాక్షిక సిరీస్ లో ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు వన్డేలతో పాటు మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే భారత మహిళా క్రికెట్ జట్టును కూడా తమ పర్యటనకు పంపించాలంటూ బీసీసీఐకి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు విన్నవించింది. దీనికి బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
'భారత మహిళా క్రికెట్ జట్టును దక్షిణాఫ్రికాకు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. దాన్ని బీసీసీఐ అంగీకరించింది. మహిళా క్రికెట్ ను సైతం ముందుకు తీసుకెళ్లడానికి ఇదొక మంచి అవకాశం. ఇందులో మూడు ట్వంటీ 20 మ్యాచ్ లను భారత మహిళా జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం. మహిళా క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనన్ని ఎక్కువ భారత్-ఎ మ్యాచ్ లు కూడా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా ఒకేసారి రెండు జట్లను వేరే దేశ పర్యటనకు పంపించడం తొలిసారేమీ కాదు. 2015లో చివరిసారి ఇదే తరహాలో ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.