
భారత్‌లో అభిమానం ఎక్కువ: ఆఫ్రిది
కోల్‌కతా: తమ జట్టుకు పాకిస్తాన్ కంటే భారత్‌లోనే ఎక్కువ ప్రేమ, అభిమానం లభిస్తుందని కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. భారత్‌లో భద్రతపై ఎప్పుడూ ఆందోళన చెందలేదన్నాడు. ‘ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆడటాన్ని నేను ఎక్కువగా ఆస్వాదిస్తాను. భారత్‌లో నాకు లభించిన ఆదరణ ప్రత్యేకమైంది. దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటా. పాక్‌లో కూడా మాకు ఇంత ప్రేమ, అభిమానం లభించదు’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు.
పాక్‌తో పోలిస్తే భారత్‌లోనే క్రికెట్‌ను ఎక్కువగా ఆరాధించే అభిమానులున్నారని మరో క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు.‘ఇక్కడ మాకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. నా భార్య భారత్ అమ్మాయి కావడంతో ఇక్కడికి చాలాసార్లు వచ్చా. నాకు ఎలాంటి భద్రతా సమస్యలు రాలేదు. ఇక్కడి ప్రజలు, మీడియా మాపై ఎనలేని ప్రేమ చూపెడుతున్నారు’ అని షోయబ్ మాలిక్ వెల్లడించాడు.