విజయం ముంగిట భారత్
కోల్కతా:న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. 376 పరుగుల విజయలక్ష్యంతో సోమవారం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను భారత బౌలర్లు కకావికలం చేశారు. భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ 190 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ రోజు ఆటలో టీ విరామానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి కాస్త ఫర్వాలేదనిపించిన కివీస్.. ఆ తరువాత మూడో సెషన్ లో మరో 6 వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్ తరువాత అరవై మూడు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను నష్టపోవడంతో న్యూజిలాండ్ ఓటమి ఖాయమైంది.
రెండో సెషన్లో సగం భాగం వరకూ పూర్తి నిలకడగా ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారిగా కీలక వికెట్లను చేజార్చుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా లంచ్ తరువాత గప్టిల్(24) వికెట్ ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు లాథమ్-నికోలస్లు మరమ్మత్తులు చేపట్టారు. అయితే నికోలస్(24)ను రెండో వికెట్ గా కోల్పోయిన తరువాత కెప్టెన్ రాస్ టేలర్(4) కూడా ఎంత సేపో క్రీజ్లో నిలబడలేదు. కాగా లాథమ్ హాఫ్ సెంచరీతో క్రీజ్ లో నిలబడి భారత బౌలర్లకు కాసేపు పరీక్ష పెట్టాడు.
అయితే లాథమ్(74) నాల్గో వికెట్ గా అవుటైన తరువాత కివీస్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు. సాంట్నార్(9), వాట్లింగ్(1) స్వల్ప వ్యవధిలో నిష్ర్కమించగా, రోంచీ(32) కాసేపు పోరాడాడు. ఆపై జీతన్ పటేల్(1), హెన్రీ(18) అవుట్ కావడంతో కివీస్ పరాజయం అంచున నిలిచింది. ఈ తొమ్మిది వికెట్లలో అశ్విన్, జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీకి రెండు , భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు 227/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు మరో 36 పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. దాంతో కివీస్ కుఉ భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ రోజు ఆటలో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహా(58నాటౌట్;120 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.మరో ఓవర్ నైట్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ (23) బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే భువీ తొమ్మిదో వికెట్ గా అవుటైన తరువాత మహ్మద్ షమీ(1) ఎంతో సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఈ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ హాఫ్ సెంచరీ సాధించిన సాహా అజేయంగా నిలవడం విశేషం.