న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల సంఖ్యపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కారణంగా సోమవారం ఇంచియాన్‌లో జరిగిన కీలక డెలిగేట్స్ రిజిస్ట్రేషన్ మీటింగ్ (డీఆర్‌ఎం)కు భారత్ హాజరుకాలేకపోయింది. దీంతో ఆటగాళ్ల అక్రిడిటేషన్‌కు గుర్తింపు ఉండకపోగా వీరు గేమ్స్ విలేజిలోకి వెళ్లేందుకు కూడా ప్రవేశం లభించదు. ‘ఇది నిజంగా భారత్‌కు ఇబ్బందికర పరిస్థితి. సోమవారం ఉదయం డీఆర్‌ఎంలో పాల్గొనే విషయంపై గేమ్స్ నిర్వాహక కమిటీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని చెప్పాను. ఆసియాలో బలమైన క్రీడాశక్తిగా ఉన్న భారత్ డీఆర్‌ఎంకు మిస్ అవడం శోచనీయం. చిన్న చిన్న దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ఈనెల 11 వరకు మనకు సమయం ఇవ్వమని నిర్వాహకులను కోరాను’ అని భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా అన్నారు.