భారత్‌కు కాంస్యం
సెమీస్‌లో 1-3తో ఇండోనేసియా చేతిలో ఓటమి
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో తమ పోరాటాన్ని ముగించింది. ఇండోనేసియాతో శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. ఈ పోటీల చరిత్రలో భారత్‌కు కాంస్యం దక్కడం ఇదే ప్రథమం. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 23-25, 21-9తో ప్రపంచ పదో ర్యాంకర్ టామీ సుగియార్తోను ఓడించి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. గతంలో సుగియార్తోతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకసారి మాత్రమే నెగ్గిన శ్రీకాంత్ ఈసారి పైచేయి సాధించాడు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో విజయావకాశం లభించినా కీలకదశలో తప్పిదాలు చేశాడు. దాంతో మ్యాచ్ మూడో గేమ్‌కు వెళ్లింది. ఈ గేమ్‌లో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం కనీసం పోటీనివ్వకుండానే చేతులెత్తేసింది. ప్రపంచ రెండో ర్యాంక్ జంట మొహమ్మద్ హసన్-హెంద్రా సెతియవాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్-మనూ అత్రి జోడీ 11-21, 10-21తో పరాజయం పాలైంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది.
మూడో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ నిరాశ పరిచాడు. ప్రపంచ 34వ ర్యాంకర్, ఇండోనేసియా భవిష్యత్ తార జిన్‌టింగ్ ఆంథోనీతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్ జయరామ్ 15-21, 20-22తో ఓడిపోయాడు. దాంతో ఇండోనేసియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో భారత జంట ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ పోరాడినా ఫలితం లేకపోయింది. ప్రపంచ 10వ ర్యాంక్ జోడీ అంగా ప్రతమా-రికీ కరాంద సువార్ది 21-13, 18-21, 21-15తో ప్రణవ్-అక్షయ్ జంటను ఓడించడంతో ఇండోనేసియా 3-1తో విజయాన్ని దక్కించుకొని ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో ఇండోనేసియా తలపడుతుంది. మహిళల ఫైనల్లో జపాన్‌తో చైనా ఢీకొంటుంది.