టీమిండియాను ఊరిస్తున్న విజయం!
బెంగళూరు:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను విజయం ఊరిస్తోంది. మంగళవారం ఆటలో 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను భారత్ కట్టడి చేస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో 101 పరుగులకే ఆరు ఆసీస్ వికెట్లను భారత్ నేలకూల్చింది ఆసీస్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెన్ షా(5), డేవిడ్ వార్నర్(17), షాన్ మార్ష్(9), స్టీవ్ స్మిత్(28), మిచెల్ మార్ష్(13), వేడ్(0)లు పెవిలియన్ చేరారు. ఈ ఆరు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియాపై రెండు సార్లు..
గతంలో 188 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని భారత్ జట్టు మూడుసార్లు కాపాడుకుంది. ఇందులో ఆస్ట్రేలియాపై రెండు సార్లు స్వల్ప లక్ష్యాన్నిభారత్ రక్షించుకుంది. 1981లో ఎంసీజీలో జరిగిన టెస్టులో , ఆపై 2004 ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ తక్కువ లక్ష్యాలను కాపాడుకుని విజయకేతనం ఎగురేసింది.