జూలు విదిల్చిన ఇషాంత్.. భారత్ 100/2
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత పేస్ బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ జూలు విదల్చడంతో టీమిండియా పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. బేసిన్ రిజర్వ్లో జరుగుతున్న ఈ చివరి టెస్టులో ఆతిథ్య జట్టును భారత బౌలర్లు 192 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇషాంత్ శర్మ రెచ్చిపోయి ఆరు వికెట్లు తీసుకోవడంతో కివీస్ జట్టు విలవిల్లాడింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 71 పరుగులతోను, ఇషాంత్ శర్మ 3 పరుగులతోను నాటౌట్గా ఉన్నారు. మురళీ విజయ్ 2 పరుగులకు, ఛటేశ్వర్ పుజారా 19 పరుగులకు వికెట్లు పారేసుకున్నారు. అంతకుముందు ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ను పేసర్ ఇషాంత్ శర్మ తుత్తునియలు చేశాడు. 17 ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి, 51 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అతడికి తోడుగా పేస్ ఎటాక్ కొనసాగించిన షమీ అహ్మద్ 16.5 ఓవర్లలో 4 మెయిడిన్లు వేసి, 70 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.