గ్రేమ్ స్మిత్ (సర్కిల్‌లో)
సెయింట్ మోర్టిజ్ : భారత్ వరుస విజయాలను చూస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోర్టిజ్‌లో జరుగుతున్న ఐస్ టీ20 టోర్నీ ఆడేందుకు వచ్చిన స్మిత్ మీడియాతో మాట్లాడారు.
‘భారత్ ఆటగాళ్లు సిరీస్‌లో 3-0తో ఆధిక్యం సాధించడానికి అర్హులు. గాయాలతో దూరమైన కీలక ఆటగాళ్ల స్థానాలు భర్తీ చేయడానికి ప్రొటీస్ యువ ఆటగాళ్లు సిద్దంగా లేరనిపిస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ భవిష్యత్తుపై సందేహం కలుగుతోంది. క్రికెట్ సౌతాఫ్రికా సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే దిశగా యువ ఆటగాళ్లను తయారు చేయాలి. ఈ ఓటములతో నేను చాలా నిరాశా చెందాను. కానీ క్రెడిట్ భారత జట్టుదే. వారు అద్భుతమైన క్రికెట్ ఆడారు. సరిగ్గా ప్రపంచకప్ ముందే ఇంత పెద్ద సిరీస్‌లో వరుసగా ఓడిపోవడం నిరాశ చెందే విషయమే. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడం మాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆటగాళ్లు వారి సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. కనీసం పోరాటపటిమనైన కనబర్చాలని’ స్మిత్ అభిప్రాపడ్డారు.
చెత్త బ్యాటింగ్..
దక్షిణాఫ్రికా చెత్త బ్యాటింగే ఓటములకు కారణమని స్మిత్ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమవుతున్నారని, ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్‌లో స్పిన్‌ను ఎదుర్కొన్న అనుభవం గల డుమినీ, మిల్లర్‌లు రాణించలేక పోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక భారత స్పిన్నర్లు చాహల్-కుల్‌దీప్‌లు అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా ఈ మణికట్టు స్పిన్నర్లు మిడిల్‌ఓవర్లలో దెబ్బతీస్తున్నారని, ఇదే భారత విజయానికి దోహదపడుతుందన్నారు.
ఇక చివరి టెస్టు ముందు కోహ్లి కెప్టెన్సీకి పనికిరాడని సంచలన వ్యాఖ్యలు చేసిన స్మిత్.. వరుస విజయాలనంతరం భారత జట్టును కొనియాడడం చర్చనీయాంశమైంది. చివరి టెస్టు నుంచి గత మూడో వన్డే వరకు భారత్ ఆతిథ్య జట్టుపై వరుస విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో కోహ్లి దూకుడు మీదుండగా యువ స్పిన్నర్లు కుల్‌దీప్, చహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌లను భారత్ వైపు తిప్పేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment