
విరాట్ కోహ్లి
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (160), ఓపెనర్ ధావన్(73)లు విజృంభించడంతో భారత్, ఆతిథ్య జట్టుకు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు రోహిత్ డకౌటవ్వడంతో ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఈ తరుణంలో వేగంగా ఆడిన ధావన్ 42 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్‌లో 25వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం వేగం పెంచిన ధావన్ సఫారీ కెప్టెన్ మార్క్‌రమ్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11) విఫలమయ్యాడు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు.
మిడిలార్డర్ విఫలం
తొలి రెండు వన్డేల్లో అంతగా బ్యాటింగ్ అవకాశం రాని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పాండ్యా(14), ధోని(10), జాదవ్(1)లు దారుణంగా విఫలమయ్యారు.
భువీ అండతో
ఒకవైపు వికెట్లు పడుతుండటంతో భారత్ సాధారణ లక్ష్యానికే పరిమితం అనుకున్న సందర్భంలో కోహ్లి, భువనేశ్వర్ అండతో భారీ స్కోర్ దిశగా ప్రయత్నించాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. భువనేశ్వర్(16) సైతం కోహ్లికి మద్దతివ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.
కోహ్లి 160(159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు) నాటౌట్‌గా నిలిచి వన్డేల్లో మూడోసారి 150 పైగా పరుగులు చేశాడు. ఇక ప్రొటీస్ బౌలర్లలో డుమినీకి రెండు వికెట్లు దక్కగా.. మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, తాహిర్‌లకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment