‘రికార్డు’ ఊరిస్తోంది! | India set to become highest run scoring team in ODIs | Sakshi
Sakshi News home page

‘రికార్డు’ ఊరిస్తోంది!

Published Tue, Dec 3 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

‘రికార్డు’ ఊరిస్తోంది!

‘రికార్డు’ ఊరిస్తోంది!

సాక్షి క్రీడావిభాగం: ఆధునిక క్రికెట్‌లో ఆస్ట్రేలియాలా హవా కొనసాగించిన జట్టు మరొకటి లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు రికార్డులన్నింటినీ అధిగమించిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత సాధారణ జట్టుగా మారిపోయింది. ప్రతి జట్టుకూ ఓ సీజన్ ఉంటుంది. ప్రస్తుతం భారత వన్డే జట్టుకు కూడా అలాంటి సీజనే నడుస్తోంది. వరుసగా ఆరు సిరీస్‌లు గెలచుకున్న ధోనిసేన... గతంలో ఏ భారత జట్టూ సాధించని ఘనతపై కన్నేసింది. ప్రపంచ క్రికెట్‌లో వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచిన జట్లు అనేకం ఉన్నాయి. 2008-09 సీజన్‌లో కూడా భారత్ ఆరు సిరీస్‌లు గెలిచింది.  ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు ధోనిసేనకు మంచి అవకాశం దొరికింది.

గెలవగలమా?
నిజానికి దక్షిణాఫ్రికాను అభేద్యమైన జట్టని చెప్పలేం. ముఖ్యంగా వన్డేల్లో ఇటీవల స్వదేశంలో ఆ జట్టు పాకిస్థాన్ చేతిలో సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌ను మిస్బాసేన 2-1తో గెలిచింది. సఫారీలు గెలిచిన చివరి వన్డేలోనూ కష్టపడ్డారు. కాబట్టి దక్షిణాఫ్రికా ఫామ్ లేమి ధోనిసేనలో ఆత్మవిశ్వాసం పెంచే అవకాశం ఉంది. పైగా గత కొంత కాలంగా భారత వన్డే జట్టు తిరుగు లేకుండా కనిపిస్తోంది. స్వదేశంలో విజయాల సంగతి పక్కన పెట్టినా...ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీలో సాధించిన విజయం భారత్ సత్తా ఏపాటిదో చూపిస్తోంది. ఆ టోర్నీలో ప్రతీ జట్టు ఏదో ఒక దశలో కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించినా...మన టీమ్ మాత్రం అజేయంగా దూసుకుపోయింది. ప్రస్తుత ఆటగాళ్లు కూడా ఫామ్‌లో ఉండటంతో ఏ సవాల్‌కైనా సిద్ధమే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తోంది.

 బౌలింగ్ ఓకేనా!
 ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత బౌలర్ల ప్రదర్శన చూస్తే ఒక రకమైన జాలి కలిగింది. పిచ్‌లు, నిబంధనల కారణంగా అంతా బ్యాట్స్‌మెన్‌మయంగా మారిపోయిన ఆటలో తమ సహజ ప్రతిభను కూడా ప్రదర్శించే అవకాశం వారికి దక్కలేదు. అయితే దక్షిణాఫ్రికాలో అలా ఉండే అవకాశం లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వికెట్లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మన పేసర్లు కూడా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయగల సమర్థులు. చాంపియన్స్ ట్రోఫీలో భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన ఈ సిరీస్‌లో ఆశలు పెంచుతోంది. ఇటీవలి ప్రదర్శనను కాస్త పక్కన పెడితే...వికెట్‌పై బౌన్స్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఇషాంత్, ఉమేశ్ సమర్థులు. ప్రత్యామ్నాయంగా షమీ కూడా స్వింగ్ బౌలర్‌గా రాణించగలడు. ‘మేం పూర్తిగా బౌన్సీ, బౌలింగ్‌కు అనుకూలమైన వికెట్లు తయారు చేస్తే అది మాకూ వ్యతిరేకంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితులను భారత బౌలర్లు కూడా బాగా ఉపయోగించుకోగలరు’ అని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన చేసిన హెచ్చరిక మన జట్టు బౌలింగ్ బలం గురించి కూడా అన్యాపదేశంగా చెబుతోంది.
 
     2002-04 సీజన్లలో కలిపి ఆస్ట్రేలియా వరుసగా పది సిరీస్ విజయాలు సాధించింది. అలాగే 2009-10లో కూడా వరుసగా 9 సిరీస్‌లలో గెలిచింది.
     వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచాయి.
 
 ఉపఖండంలా స్కోర్లు ఉండవు!
 వన్డేల్లో నిబంధనల మార్పుతో సొంతగడ్డపై బౌలర్లను చితక్కొట్టి ఇటీవల భారత్ పరుగుల ప్రవాహం పారించింది. మన బ్యాట్స్‌మెన్ కారణంగానే వరుసగా సిరీస్‌లు గెలిచాం. అయితే ఇక్కడి తరహాలో దక్షిణాఫ్రికాలో భారీ స్కోర్లకు పెద్దగా అవకాశం లేదు. గత రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో భారత్ అత్యధిక స్కోరు 50 ఓవర్లలో 279/5 (2001లో) మాత్రమే. ఇటీవల సఫారీలతో జరిగిన పాక్ సిరీస్‌లో కూడా ఇదే కనిపించింది. కాబట్టి 260-275 పరుగులు సాధిస్తే దానిని మెరుగైన స్కోరుగానే చెప్పవచ్చు. ఇక్కడి తరహాలో ఆటగాళ్లు ఏకధాటిగా దూకుడుకు పోకుండా నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. మన మిడిలార్డర్ సత్తా బయట పడేది ఇక్కడే. సెంచరీల హోరుకు అవకాశం తక్కువగా ఉండే చోట...జట్టులో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement