స్మృతి... డబుల్‌ ధమాకా | India Smriti Mandhana named ICC womens cricketer of the year | Sakshi
Sakshi News home page

స్మృతి... డబుల్‌ ధమాకా

Published Tue, Jan 1 2019 1:49 AM | Last Updated on Tue, Jan 1 2019 5:29 AM

 India Smriti Mandhana named ICC womens cricketer of the year - Sakshi

దుబాయ్‌: భారత మహిళా క్రికెట్‌ డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన 2018 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ‘ఉత్తమ మహిళా క్రికెటర్‌’... ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులను గెలుచుకుంది. ఎడంచేతి వాటం విధ్వంసక బ్యాటర్‌ అయిన 22 ఏళ్ల స్మృతి గతేడాది 12 వన్డేల్లో 669 పరుగులు (సగటు 66.90), 25 టి20ల్లో 622 పరుగులు (స్ట్రయిక్‌ రేట్‌ 130.67) చేసింది. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ చేరడంలో స్మృతిది కీలక పాత్ర. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో ఆమె 125.35 స్ట్రయిక్‌ రేట్‌తో 178 పరుగులు చేసింది. పేసర్‌ జులన్‌ గోస్వామి (2007) తర్వాత ‘ఐసీసీ మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచిన భారత క్రికెటర్‌గా స్మృతి రికార్డులకెక్కింది. ఇందులో భాగంగా ఆమె రాచెల్‌ హెహొయ్‌ ఫ్లింట్‌ అవార్డును అందుకోనుంది. ‘అవార్డులు మన ప్రతిభకు గుర్తింపు. మరింత కష్టపడేందుకు, జట్టుకు ఉపయోగపడేందుకు ఇవి ప్రేరణగా ఉపయోగపడతాయి. కింబర్లీలో దక్షిణాఫ్రికాపై చేసిన శతకం నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపైనా రాణించా. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయా. ఈ విషయంలో నన్ను నేను నిరూపించుకుంటా’ అని స్మృతి పేర్కొంది. మరోవైపు ‘స్మృతి తన అద్వితీయ ఆటతో 2018లో మహిళా క్రికెట్‌ అభిమానులను అలరించింది. ఈ ఏడాదిని గుర్తుంచుకునేదిగా చేసింది’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ కొనియాడారు. ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్‌ కీపర్‌ అలీసా హీలీకి ‘ఐసీసీ టి20 మహిళా క్రికెటర్‌’ అవార్డు దక్కింది. 

ప్రపంచ టి20 జట్టు సారథిగా  హర్మన్, వన్డే జట్టుకు బేట్స్‌ 
‘ఐసీసీ టి20 టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2018’ కెప్టెన్‌గా భారత టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, ప్రపంచ వన్డే జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సుజీ బేట్స్‌ ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్లు లిసా స్థలేకర్, చార్లెట్‌ ఎడ్వర్డ్స్, అంజుమ్‌ చోప్రాలతో కూడిన కమిటీ గతేడాది ప్రదర్శనల ఆధారంగా ఓటింగ్‌ నిర్వహించగా వీరిద్దరికీ ప్రపంచ జట్ల పగ్గాలు దక్కాయి. అయితే, హర్మన్‌కు వన్డే టీమ్‌లో చోటు దక్కకపోవడం గమనార్హం. భారత ఓపెనర్‌ స్మృతి మంధాన, లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ రెండింటిలోనూ సభ్యులుగా ఉన్నారు. ‘టి20 ప్రపంచ కప్‌లో హర్మన్‌ 160.5 స్ట్రయిక్‌ రేట్‌తో 183 పరుగులు చేసింది. 2018లో ఆమె మొత్తం 25 మ్యాచ్‌ల్లో 126.2 స్ట్రయిక్‌ రేట్‌తో 663 పరుగులు చేసింది’ అని ఐసీసీ పేర్కొంది. ‘నిజంగా చెప్పాలంటే ఇది నన్ను ఆశ్చర్యపర్చింది. ఈ ఘనత మా జట్టు సభ్యులదే. గత రెండేళ్లలో మేం ఎక్కువగా టి20లు ఆడలేదు. మనం టి20ల్లో రాణించగలం అని జట్టులో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ప్రయత్నించా. ఈ అవార్డు బాధ్యతను పెంచింది. బీసీసీఐ నాపై ఉంచిన నమ్మకంతో ఈ ఫార్మాట్లో మరింత బాగా రాణించేందుకు కృషి చేస్తా‘ అని హర్మన్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement