womens cricketers
-
దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లకు కరోనా
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ బృందంలో ముగ్గురు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లు కాగా ఒకరు సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) శనివారం ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటన కోసం సోమవారం నుంచి మహిళల క్రికెట్ శిక్షణా శిబిరం జరగాల్సి ఉండగా... ప్రాక్టీస్ సెషన్ నుంచి ఈ ముగ్గురిని తప్పించినట్లు సీఎస్ఏ వెల్లడించింది. పాజిటివ్‌గా తేలిన ముగ్గురిలోనూ అతి స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని పేర్కొన్న సీఎస్ఏ రానున్న పది రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొంది. అనంతరం తమ వైద్య బృందం పరీక్షించాకే వారు ప్రాక్టీస్‌లో పాల్గొంటారని చెప్పింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ శిబిరానికి హాజరయ్యే క్రికెటర్ల బృందానికి 34 రకాల పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్ఏ వెల్లడించింది. -
స్మృతి... డబుల్ ధమాకా
దుబాయ్: భారత మహిళా క్రికెట్ డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన 2018 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ఉత్తమ మహిళా క్రికెటర్’... ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెలుచుకుంది. ఎడంచేతి వాటం విధ్వంసక బ్యాటర్ అయిన 22 ఏళ్ల స్మృతి గతేడాది 12 వన్డేల్లో 669 పరుగులు (సగటు 66.90), 25 టి20ల్లో 622 పరుగులు (స్ట్రయిక్ రేట్ 130.67) చేసింది. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంలో స్మృతిది కీలక పాత్ర. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో ఆమె 125.35 స్ట్రయిక్ రేట్‌తో 178 పరుగులు చేసింది. పేసర్ జులన్ గోస్వామి (2007) తర్వాత ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన భారత క్రికెటర్‌గా స్మృతి రికార్డులకెక్కింది. ఇందులో భాగంగా ఆమె రాచెల్ హెహొయ్ ఫ్లింట్ అవార్డును అందుకోనుంది. ‘అవార్డులు మన ప్రతిభకు గుర్తింపు. మరింత కష్టపడేందుకు, జట్టుకు ఉపయోగపడేందుకు ఇవి ప్రేరణగా ఉపయోగపడతాయి. కింబర్లీలో దక్షిణాఫ్రికాపై చేసిన శతకం నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లపైనా రాణించా. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయా. ఈ విషయంలో నన్ను నేను నిరూపించుకుంటా’ అని స్మృతి పేర్కొంది. మరోవైపు ‘స్మృతి తన అద్వితీయ ఆటతో 2018లో మహిళా క్రికెట్ అభిమానులను అలరించింది. ఈ ఏడాదిని గుర్తుంచుకునేదిగా చేసింది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ కొనియాడారు. ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హీలీకి ‘ఐసీసీ టి20 మహిళా క్రికెటర్’ అవార్డు దక్కింది. ప్రపంచ టి20 జట్టు సారథిగా హర్మన్, వన్డే జట్టుకు బేట్స్ ‘ఐసీసీ టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’ కెప్టెన్‌గా భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రపంచ వన్డే జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్లు లిసా స్థలేకర్, చార్లెట్ ఎడ్వర్డ్స్, అంజుమ్ చోప్రాలతో కూడిన కమిటీ గతేడాది ప్రదర్శనల ఆధారంగా ఓటింగ్ నిర్వహించగా వీరిద్దరికీ ప్రపంచ జట్ల పగ్గాలు దక్కాయి. అయితే, హర్మన్‌కు వన్డే టీమ్‌లో చోటు దక్కకపోవడం గమనార్హం. భారత ఓపెనర్ స్మృతి మంధాన, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ రెండింటిలోనూ సభ్యులుగా ఉన్నారు. ‘టి20 ప్రపంచ కప్‌లో హర్మన్ 160.5 స్ట్రయిక్ రేట్‌తో 183 పరుగులు చేసింది. 2018లో ఆమె మొత్తం 25 మ్యాచ్‌ల్లో 126.2 స్ట్రయిక్ రేట్‌తో 663 పరుగులు చేసింది’ అని ఐసీసీ పేర్కొంది. ‘నిజంగా చెప్పాలంటే ఇది నన్ను ఆశ్చర్యపర్చింది. ఈ ఘనత మా జట్టు సభ్యులదే. గత రెండేళ్లలో మేం ఎక్కువగా టి20లు ఆడలేదు. మనం టి20ల్లో రాణించగలం అని జట్టులో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు ప్రయత్నించా. ఈ అవార్డు బాధ్యతను పెంచింది. బీసీసీఐ నాపై ఉంచిన నమ్మకంతో ఈ ఫార్మాట్లో మరింత బాగా రాణించేందుకు కృషి చేస్తా‘ అని హర్మన్ పేర్కొంది. -
భారత క్రికెటర్ల జీతాలు భారీగా పెంపు!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల పంట పండనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే ఆటగాళ్లకు శుభవార్త తెలపనుంది. బీసీసీఐ బోర్డు పరిధిలో ఆడుతున్న వారందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి, అండర్-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ చానెల్‌కు తెలిపారు. దీనికి సంబందించిన ప్రక్రియ దాదాపు పూర్తైందని.. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి వెల్లడించారు. ఇక భారత పురుషుల జట్టు శ్రీలంక పర్యటనకు ముందే సుమారు 25 మంది క్రికెటర్లను ఏ,బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేయనున్నారు. జీతాల పెంపునకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి ఐపీఎల్ కన్నా ముందే ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏడాదికి గ్రేడ్-ఏ క్రికెటర్లకు దాదాపుగా రూ.12కోట్లు, బి-గ్రేడ్ రూ.8 కోట్లు, సీ-గ్రేడ్ నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనేదాన్ని నిర్ణయిస్తుంది. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ,పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్ బీ రూ.1 కోటి, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ.50 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. -
మహిళల జట్టుకూ సదవకాశం
కింబర్లీ: దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలుచుకునేందుకు భారత మహిళల క్రికెట్ జట్టు ముందు మంచి అవకాశం. తొలి వన్డేలో 88 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన మిథాలీ సేన... బుధవారం కింబర్లీలో రెండో వన్డే ఆడనుంది. ప్రపంచకప్ ఆడిన ఏడు నెలల తర్వాత బరిలో దిగినా ఆ ప్రభావం ఏమీ లేకుండా సోమవారం ప్రత్యర్థిపై సునాయాస విజయం సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవడం కష్టం కాదు. బ్యాటింగ్‌లో స్మృతి, కెప్టెన్ మిథాలీ, బౌలింగ్‌లో పేసర్లు జులన్, శిఖా పాండేల ఫామ్‌తో జట్టు బలంగా కనిపిస్తోంది. మొదటి వన్డేలో వీరే గెలుపు బాధ్యత మోశారు. ఈసారీ రాణిస్తే తిరుగుండదు. మిగతావారు విఫలమవడంతో సఫారీలు కెప్టెన్ వాన్ నికెర్క్పైనే ఆధారపడుతున్నారు. సిరీస్ చేజారకుండా చూసుకోవాలంటే వారు సమష్టిగా ఆడాల్సిన అవసరం ఉంది. -
వకార్.. ఇప్పుడేమంటావ్!
బ్రిస్టల్:మహిళల వన్డే క్రికెట్లో 50 ఓవర్లు అనవసరం. దాన్ని 30 ఓవర్లకు తగ్గిస్తే బాగుటుంది. మహిళా క్రికెట్లో మజా ఉండాలంటే తక్కువ ఓవర్లే కరెక్ట్. తక్కువ ఓవర్లు ఉంటే బౌలర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారు. టెన్నిస్ లో పురుషులకు ఐదు సెట్లు ఉంటే మహిళలకు మూడు సెట్లే ఉంటాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని మహిళల వన్డే ఓవర్లను 30 కి తగ్గించండి'అని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ల వకార్ యూనిస్ చేసిన విన్నపం ఇది. అయితే దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనడిచింది. వకార్ వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లను అవమాన పరిచేవిధంగా ఉన్నాయంటూ విమర్శలు చెలరేగాయి. దానికి మహిళా క్రికెటర్లే తమ బ్యాటింగ్ తో సమాధానం చెప్పడం మరోసారి వకార్ వార్తల్లోకి వచ్చాడు. బుధవారం ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ ఆద్యంతం దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 373 పరుగులు చేస్తే, ఆపై దక్షిణాఫ్రికా 50 ఓవర్లపాటు ఆడి 9 వికెట్లకు 305 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్వుమెన్లలో బీమౌంట్(148;145 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్), సారా టేలర్(147;104 బంతుల్లో 24 ఫోర్లు)లు సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో వోల్వర్ద్త్(67;103 బంతుల్లో 9 ఫోర్లు), లిజెల్లీ లీ(72; 77 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సైతం దాటికి ఆడారు. దాంతో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతను రేపింది. మరి వకార్.. ఇప్పుడేమంటావ్ అంటూ మహిళా క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. వన్డే క్రికెట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఐదు వందలకు పైగా పరుగులు సరిపోవా అంటూ నిలదీస్తున్నారు. అసలు వకార్ కు ఎన్నిపరుగులైతే వినోదాన్ని ఇస్తాయో చెప్పాలంటూ మండిపడుతున్నారు.