వకార్.. ఇప్పుడేమంటావ్!
బ్రిస్టల్:మహిళల వన్డే క్రికెట్లో 50 ఓవర్లు అనవసరం. దాన్ని 30 ఓవర్లకు తగ్గిస్తే బాగుటుంది. మహిళా క్రికెట్లో మజా ఉండాలంటే తక్కువ ఓవర్లే కరెక్ట్. తక్కువ ఓవర్లు ఉంటే బౌలర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారు. టెన్నిస్ లో పురుషులకు ఐదు సెట్లు ఉంటే మహిళలకు మూడు సెట్లే ఉంటాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని మహిళల వన్డే ఓవర్లను 30 కి తగ్గించండి'అని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ల వకార్ యూనిస్ చేసిన విన్నపం ఇది. అయితే దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనడిచింది. వకార్ వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లను అవమాన పరిచేవిధంగా ఉన్నాయంటూ విమర్శలు చెలరేగాయి.
దానికి మహిళా క్రికెటర్లే తమ బ్యాటింగ్ తో సమాధానం చెప్పడం మరోసారి వకార్ వార్తల్లోకి వచ్చాడు. బుధవారం ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ ఆద్యంతం దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 373 పరుగులు చేస్తే, ఆపై దక్షిణాఫ్రికా 50 ఓవర్లపాటు ఆడి 9 వికెట్లకు 305 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్వుమెన్లలో బీమౌంట్(148;145 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్), సారా టేలర్(147;104 బంతుల్లో 24 ఫోర్లు)లు సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో వోల్వర్ద్త్(67;103 బంతుల్లో 9 ఫోర్లు), లిజెల్లీ లీ(72; 77 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సైతం దాటికి ఆడారు.
దాంతో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతను రేపింది. మరి వకార్.. ఇప్పుడేమంటావ్ అంటూ మహిళా క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. వన్డే క్రికెట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఐదు వందలకు పైగా పరుగులు సరిపోవా అంటూ నిలదీస్తున్నారు. అసలు వకార్ కు ఎన్నిపరుగులైతే వినోదాన్ని ఇస్తాయో చెప్పాలంటూ మండిపడుతున్నారు.