
శ్రీలంకను వారి గడ్డపై చిత్తుగా ఓడించిన భారత జట్టుకు స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. పిచ్ కారణంగా తొలి రోజు తడబాటుతో పాటు వాతావరణం కూడా లంకను ఆదుకోవడంతో చివరకు ‘డ్రా’తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న టీమిండియా మరో పోరుకు సన్నద్ధమైంది. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సన్నాహకం అంటూ కోల్‌కతాలాగే నాగ్‌పూర్‌లోనూ పేస్ వికెట్‌నే కోరుకుంటున్న కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే శ్రీలంకకు కష్టాలు తప్పవు.
ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
నాగ్‌పూర్: వర్షం బారిన పడి అర్ధానందాన్నే మిగిల్చిన తొలి టెస్టు తర్వాత భారత్, శ్రీలంక సిరీస్‌లో ఆధిక్యం కోసం మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఇక్కడి జామ్‌తా స్టేడియంలో జరిగే రెండో టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్టులో ఓటమికి చేరువైన లంక త్రుటిలో దానిని తప్పించుకోగా... గెలుపు భారత్ చేజారింది. గత మ్యాచ్‌లో ముందుగా వెనుకబడి కూడా విజయావకాశాలు సృష్టించుకొని భారత్ తమ స్థాయిని ప్రదర్శించగా... శ్రీలంక తడబాటుతో తమ బలహీనతలు బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి.
విజయ్ రెడీ...
శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో గాయంతో ఆఖరి నిమిషంలో మురళీ విజయ్ తప్పుకోగా, శిఖర్ ధావన్ అవకాశం దక్కించుకొని చెలరేగాడు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో ధావన్ దూరం కావడంతో ఓపెనర్‌గా విజయ్ మళ్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. రాహుల్, పుజారా, కోహ్లి మరోసారి బ్యాటింగ్ భారం మోస్తారు. గత టెస్టులో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ రహానే సత్తా చాటాల్సి ఉంది. ఈడెన్‌తో పోలిస్తే ఇక్కడ స్పిన్ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అశ్విన్, జడేజాలు జట్టులో కొనసాగుతారు.
ఇద్దరు పేసర్లు షమీ, ఉమేశ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. పెళ్లి కారణంగా భువనేశ్వర్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో వాస్తవానికి అతని స్థానంలో నేరుగా ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చేయాలి. రంజీల్లో ఇషాంత్ ఫామ్ కూడా చాలా బాగుంది. 4 మ్యాచ్‌లలో కలిపి అతను 20 వికెట్లు తీశాడు. అయితే హార్దిక్ పాండ్యా తరహాలో సీమ్ ఆల్‌రౌండర్‌ను ప్రయత్నించాలని భావిస్తే మాత్రం కొత్త ఆటగాడు విజయ్ శంకర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే విధంగా అదనపు బ్యాట్స్‌మన్ కావాలనుకుంటే మాత్రం రోహిత్ శర్మ జట్టులో ఉంటాడు. కోల్‌కతా తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడ్డా... రెండో ఇన్నింగ్స్ ప్రదర్శన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే జోరు ఇక్కడా కొనసాగించాల్సి ఉంది.
డి సిల్వాకు అవకాశం!
టాస్ గెలవడం, అనుకూల వాతావరణంలో గత మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పండగ చేసుకుంది. అయితే భారత్‌ను కుప్పకూల్చిన లక్మల్ తర్వాత అదే ఆటను కొనసాగించలేకపోగా, రెండో ఇన్నింగ్స్‌లో జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శించింది. కాబట్టి ఈ మ్యాచ్ లంక సామర్థ్యానికి సవాల్ విసరనుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో తిరిమన్నె, మాథ్యూస్ మాత్రమే కొంత పోరాడగలిగారు. కరుణరత్నే, సమరవిక్రమలతో పాటు కెప్టెన్ చండిమాల్ కూడా రాణించాల్సి ఉంది. బ్యాటింగ్ బలహీనతను అధిగమించేందుకు ఆ జట్టు ధనంజయను జట్టులోకి తీసుకోనుంది. దూకుడులో సంగక్కరను గుర్తు చేస్తున్న డిక్‌వెలాపై కూడా లంక ఆశలు పెట్టుకుంది. ఇక లక్మల్‌తో పాటు మరో పేసర్‌గా ఫెర్నాండో బరిలోకి దిగుతాడు. స్పిన్నర్ హెరాత్‌కు ఈ మ్యాచ్‌లో కాస్త పని పడవచ్చు. పిచ్ అనుకూలిస్తే అతను కూడా ప్రమాదకారి కాగలడు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్/విజయ్ శంకర్, షమీ, ఉమేశ్.
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, తిరిమన్నె, మాథ్యూస్, డిక్‌వెలా, ధనంజయ డి సిల్వా/షనక, పెరీరా, లక్మల్, హెరాత్, విశ్వ ఫెర్నాండో.
పిచ్, వాతావరణం
జామ్‌తా మైదానంలో కూడా పేస్ పిచ్‌నే సిద్ధం చేశారు. అయితే ఈడెన్‌తో పోలిస్తే పచ్చిక తక్కువగా ఉండటంతో పాటు నాగ్‌పూర్ పొడి వాతావరణం వల్ల కూడా ఆరంభంలో కాస్త ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్ పిచ్, చివర్లో టర్నింగ్‌కు కూడా అవకాశం ఉంది. స్పిన్నర్లు ప్రభావం చూపించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment