సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగు పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ధావన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో గోల్డెన్ డక్‌గా ఔటైన అపప్రథను మూటగట్టుకున్నాడు. ఆసీస్ పేసర్ బెహ్రాన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని ఆడటంలో తడబడిన ధావన్ వికెట్లు ముందు దొరికిపోయాడు.
తొలి ఓవర్ ఐదో బంతికి ఎక్స్‌ట్రా(లెగ్ బై) రూపంలో పరుగు రాగా, ఆపై మరుసటి బంతికి ధావన్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అటు తర్వాత విరాట్ కోహ్లి(3) సైతం నిరాశపరచడంతో టీమిండియా నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై వెంటనే అంబటి రాయుడు డక్ ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కోహ్లి, రాయుడు వికెట్‌లను యువ పేసర్ రిచర్డ్‌సన్ తీసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. అంతకుముందు ఆసీస్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(59; 81 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(54; 70 బంతుల్లో 4 ఫోర్లు), హ్యాండ్ స్కాంబ్(73; 61 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు మార్కస్ స్టోనిస్(47 నాటౌట్; 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment