ఎలాంటి పోరాటం లేదు. ప్రత్యర్థిని కొద్ది సేపయినా నిరోధించగల పట్టుదల కనిపించలేదు. ఊహించినట్లుగానే టెయిలెండర్ల నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురు కాలేదు. ఫలితంగా పెర్త్ టెస్టులో భారత్ పరాజయానికి మంగళవారం 65 నిమిషాలు సరిపోయాయి. సంయుక్తంగా 10 టెస్టుల అనుభవం కూడా లేని విహారి, పంత్‌లు ఎలాంటి ప్రత్యేక ప్రదర్శనను ఇవ్వలేకపోగా, ఆస్ట్రేలియా భారీ విజయంతో సిరీస్‌ను సమం చేసి పోటీలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఏడాది విదేశీ గడ్డపై 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిన ఐదు సార్లూ పరాజయం చవిచూసిన కోహ్లి సేన ఖాతాలో అలాంటిదే మరో ఓటమి చేరింది. సరిగ్గా వారం విరామం తర్వాత ఈనెల 26న మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఇరు జట్లు మళ్లీ బలపరీక్షకు సిద్ధం కానున్నాయి.
పెర్త్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. మ్యాచ్ చివరి రోజు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1–1తో సమంగా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 112/5తో ఆట కొనసాగించిన టీమిండియా ఇన్నింగ్స్ ముగిసేందుకు 15 ఓవర్లు మాత్రమే పట్టాయి. రిషభ్ పంత్ (61 బంతుల్లో 30; 2 ఫోర్లు), హనుమ విహారి (75 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటైన తర్వాత చివరి నలుగురు భారత బ్యాట్స్‌మెన్ కలిపి 2 పరుగులు మాత్రమే చేయగలిగారు. టెస్టులో ఎనిమిది కీలక వికెట్లతో సత్తా చాటిన ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లయన్ (8/106) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియాకు ఇది మొదటి విజయం కాగా... కెప్టెన్‌గా పైన్‌కు కూడా ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. మూడో టెస్టు ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.
టపటపా...
ఐదో రోజు ఆటను విహారి, పంత్ జాగ్రత్తగా ఆరంభించారు. ముఖ్యంగా స్టార్క్‌ను విహారి సమర్థంగా ఎదుర్కొన్నాడు. అయితే స్టార్క్ బౌలింగ్‌లోనే విహారి లెగ్‌సైడ్ ఆడబోగా అనూహ్యంగా లేచిన బంతి మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లో పడింది. కొద్దిసేపటి తర్వాత లయన్ బౌలింగ్‌లో పంత్ ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోగా విహారి తరహాలోనే మిడ్ వికెట్ వద్దే బంతి లేచింది. హ్యాండ్స్‌కోంబ్ ఎడమవైపు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్‌ను అందుకోవడంతో భారత్ ఆట దాదాపుగా ముగిసింది. 23 బంతులు ఆడిన ఉమేశ్ (2)ను స్టార్క్ పెవిలియన్ పంపించగా...తర్వాతి ఓవర్ వేసిన కమిన్స్ నాలుగు బంతుల వ్యవధిలో ఇషాంత్ (0), బుమ్రా (0)లను ఔట్ చేసి ఆసీస్‌ను గెలిపించాడు.
స్వదేశానికి రోహిత్ శర్మ!
గాయంతో రెండో టెస్టు ఆడని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మెల్‌బోర్న్ టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని భార్య రితిక సజ్దే ఈ వారంలో తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. దాంతో రోహిత్ స్వదేశానికి పయనమవుతున్నాడు. అతను మూడో టెస్టులోగా తిరిగి ఆస్ట్రేలియా వెళతాడా లేదా అనేది సందేహమే. మరోవైపు తర్వాతి రెండు టెస్టుల కోసం ఎలాంటి మార్పులు లేకుండా ఆసీస్ తమ జట్టును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment