క్లీన్‌స్వీప్‌పై భారత్ ‘ఎ’ దృష్టి | india team looking to clean sweep | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌పై భారత్ ‘ఎ’ దృష్టి

Published Thu, Sep 12 2013 12:49 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

india team looking to clean sweep

 సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్ ‘ఎ’తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత ‘ఎ’ జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో ఇరు జట్లు గురువారం ఇక్కడ తలపడనున్నాయి. టెస్టు సిరీస్ డ్రాగా ముగిసిన అనంతరం వన్డేల్లో చెలరేగిన భారత్ రెండు మ్యాచుల్లోనూ సంపూర్ణ ఆధిక్యం కనబరిచింది.
 
 రిజర్వ్‌కు అవకాశం...
 టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఉన్ముక్త్ చంద్ వన్డేల్లో కెప్టెన్‌గా సత్తా చాటుతూ 94, 59 పరుగులు చేశాడు. తొలి వన్డేలో రాబిన్ ఉతప్ప కూడా సెంచరీతో చెలరేగాడు. ఈ ఇద్దరు మరోసారి రాణిస్తే భారత్‌కు మరో విజయం దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాకపోయినా రెండో వన్డేలో మిడిలార్డర్ ఆటగాళ్లు మన్‌దీప్ సింగ్, జాదవ్, మనేరియా మెరుగైన ప్రదర్శన కనబర్చారు. బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి, రాహుల్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత రెండు వన్డేల్లో అవకాశం దక్కని బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్, బౌలర్ జలజ్ సక్సేనాలకు ఈసారి తుది జట్టులో చోటు లభించవచ్చు.
 
 పరువు కోసం...
 మరోవైపు సిరీస్ ఓడిపోయినా గెలుపుతో ఈ పర్యటనను ముగించాలని కివీస్ భావిస్తోంది. మొత్తం టూర్‌లో విజయమన్నదే ఎరుగని ఈ టీమ్ చివరి వన్డే నెగ్గాలని పట్టుదలగా ఉంది. అయితే అది అంత సులభం కాదు. కార్ల్ కచోపా ఒక్కడే రెండు మ్యాచుల్లోనూ రాణించగా, ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో న్యూజిలాండ్ వెనుకబడింది. ల్యూక్ రాంచీ, లాథమ్ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. మరోవైపు బలహీనమైన బౌలింగ్‌తో భారత్‌ను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement