'రియో' సమరానికి సన్నాహకం!
ఇఫో(మలేషియా): రియో ఒలింపిక్స్ సన్నాహకాలకు భారత పురుషుల హాకీ జట్టు సన్నద్ధమైంది. మలేషియాలో బుధవారం నుంచి ఆరంభం కానున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ లో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ లో పటిష్టమైన జపాన్ తో తలపడనుంది. ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణపతకం సాధించిన భారత్.. మరో నాలుగు నెలల్లో ఆరంభమయ్యే రియోకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ టోర్నీని ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
గతేడాది మూడో స్థానం సాధించి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని యోచిస్తోంది. మరోవైపు యువకులతో జట్టును కూడా పరీక్షించేందుకు సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు సమాయత్తమైంది. రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఈటోర్నీకి ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.
ఆగస్టులో రియో ఒలింపిక్స్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఎక్కువశాతం మంది యువకులనే ఈ టోర్నీకి ఎంపిక చేసినట్లు భారత హాకీ కోచ్ రియోలాంట్ వాల్ట్ మాన్స్ స్పష్టం చేశాడు. ఇక్కడ తమ ప్రతిభను నిరూపించుకుని ప్రధాన టోర్నీలకు అర్హత సాధించేందకు వారికి ఇదొక సువర్ణావకాశమన్నాడు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కావొద్దని యువ హాకీ ఆటగాళ్లకు వాల్ట్ మాన్స్ సూచించాడు. ఈసారి కప్ ను సాధించి భారత అభిమానుల ఆశలను నిజం చేస్తామన్నాడు.
ఇప్పటివరకూ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ను ఆస్ట్రేలియా ఎనిమిది సార్లు గెలిచి తొలి స్థానంలో ఉండగా, భారత జట్టు ఐదు సార్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. గతేడాది ఆస్ట్రేలియాను ఓడించిన న్యూజిలాండ్ కప్ ను సాధించింది. దీంతో ఆస్ట్రేలియా రన్నరప్ గా సరిపెట్టుకోగా, భారత్ కు మూడో స్థానం దక్కింది. అజ్లాన్ షా కప్‌లో భారత్‌తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి.