
ఇషాన్ కిషాన్ (ఫైల్ ఫోటో)
సావర్(బంగ్లాదేశ్): అండర్ -19 వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లో భాగంగా ఇక్కడ కెనడాతో జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత యువ జట్టు కుమ్మేసింది. కెనడాను ఓ ఆటాడుకున్న భారత్ 372 పరుగులతో తేడాతో భారీ విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీల సాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. యువ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషాన్(138 రిటైర్డ్ హర్ట్; 86 బంతుల్లో16 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా, అతనికి జతగా ఓపెనర్ గా వచ్చిన ఆర్ ఆర్ పాంట్(62) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం రికీ భుయీ(115; 71 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.ఆపై సర్ఫరాజ్ ఖాన్(48), ఆర్మాన్ జాఫర్(36), లామ్రోర్ (55నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో యువ భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 485 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన కెనడా 31.1 ఓవర్లలో 113 పరుగులకే చాపచుట్టేసింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆ తరువాత కెనడాను పేకమేడలా కూల్చేసింది. కెనడా ఆటగాళ్లలో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్కును చేరుకోలేకపోవడం గమనార్హం. కెనడా ఇన్నింగ్స్ లో మిడిల్ ఆర్డర్ ఆటగాడు హెచ్ ధాకర్(25) చేసిన పరుగులే అత్యధిక స్కోరు. యువ భారత బౌలర్లలో లామ్రోర్ కు మూడు వికెట్లు లభించగా, మావి, జీషన్ అన్సారీలకు తలో రెండు వికెట్లు దక్కాయి.