
అదరగొట్టిన యువ భారత్
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా గురువారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు అదరగొట్టి 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (74),వాషింగ్టన్ సుందర్(62)లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా, రికీ భూయి(39),జీషన్ అన్సారీ (36) ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ 50.0ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.
అనంతరం 269 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు టెక్టార్(1), దోహ్నీ(4)లు నిష్ర్కమించడంతో ఐర్లాండ్ కష్టాల్లో పడింది. ఆ తరువాత డెన్నిసన్(20), గారీ మెక్ క్లింటాక్(17)లు అవుట్ కావడంతో ఐర్లాండ్ 46 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో విలియమ్ మెక్ క్లింటాక్(58),టక్కర్(57)లు రాణించినా ఐర్లాండ్ ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఈ జోడీ ఐదో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం మినహా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. దీంతో ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 189 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. భారత బౌలర్లలో రాహుల్ బాథమ్ మూడు వికెట్లు తీయగా, అవిష్ ఖాన్, లామ్రోర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.