
మైసూర్: లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (5/31) మణికట్టు మాయాజాలానికి ఇంగ్లండ్ లయన్స్ తోక ముడిచింది. రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మరో రోజు మిగిలుండగానే భారత్ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 24/0తో ఫాలోఆన్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 53.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో లయన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఓపెనర్ బెన్ డకెట్ (50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా, లోయర్ మిడిలార్డర్‌లో లూయిస్ గ్రెగరీ (44; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
మిగిలిన వారిలో కెప్టెన్ బిల్లింగ్స్ 20 పరుగులు చేయగా, భారత బౌలర్ల ధాటికి ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 40 పరుగుల వద్ద జలజ్ సక్సేనా బౌలింగ్‌లో హోల్డన్ (7) వికెట్‌తో మొదలైన పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. 140/5 స్కోరుతో ఉన్న లయన్స్ జట్టు... మార్కండే మాయాజాలం మొదలుకాగానే 40 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. జలజ్ సక్సేనా 2, నవదీప్ సైని, షాబాజ్ నదీమ్, వరుణ్ అరోన్ తలా ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లోని భారత్ ‘ఎ’... లయన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌట్ చేసింది.