విరాట్ సేన 4-1తో గెలిస్తేనే..!
చెన్నై:ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాను ఇప్పుడు మరొక సువర్ణావకాశం ఊరిస్తోంది. వన్డేల్లో భారత జట్టు టాప్ ర్యాంక్ కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ ను 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు 117 పాయింట్లతో సమంగా ఉన్నాయి.
అయితే ర్యాంకింగ్స్ లో మాత్రం డెసిమల్ పాయింట్ల ఆధారంగా ఆసీస్ రెండో స్థానంలో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ సఫారీలను భారత్ అధిగమించాలంటే తాజా సిరీస్ ను 4-1 తో కైవసం చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ భారత్ ఒక మ్యాచ్ ను మాత్రమే కోల్పోతే 120 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకును సాధిస్తుంది.
మరొకవైపు ఆసీస్ కూడా 4-1తో సిరీస్ సాధించిన పక్షంలో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంటుంది. అప్పుడు భారత్ 114 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంటుంది. ఒకవేళ ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం భారత ర్యాంకు నాల్గో స్థానానికి పడిపోతుంది. ప్రస్తుత ఆసీస్-భారత జట్లు రెండు పటిష్టంగా ఉన్న తరుణంలో ఐదు వన్డేల సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. అయితే స్వదేశంలో జరిగే సిరీస్ కాబట్టి భారత్నే ఫేవరెట్ గా చెప్పుకొవచ్చు. ఇక్కడ ఇరు జట్లకు నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకునేందుకు సమాన అవకాశాలు ఉండటంతో రసవత్తర పోరు ఖాయం. ఈ నెల 17వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది.