‘బొగ్గు’తో ఆరబెడుతున్నారు
చెన్నై: సాధారణంగా వర్షం కారణంగా మైదానం తడిగా మారినప్పుడు సూపర్ సాపర్లతో అవుట్‌ఫీల్డ్ నుంచి నీరు తొలగించడం, డ్రైయర్లతో పిచ్‌ను ఆరబెట్టడం కనిపిస్తుంది. ఇందు కోసం కొన్ని సార్లు హెలికాప్టర్లను వాడటం కూడా చూశాం. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది పాత పద్ధతుల్లోకి వెళ్లిపోయారు. అందులో భాగంగా బొగ్గును కాలబెట్టి దాని వేడితో పిచ్‌ను ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టును ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) అందు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
‘వర్దా’ తుపాను కారణంగా నగరం అతలాకుతలమైపోగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ మ్యాచ్ కోసం చిదంబరం స్టేడియంను సిద్ధం చేసే పనిలో పడ్డారు. బుధవారం క్యురేటర్ కాశీవిశ్వనాథ్, సిబ్బంది మొత్తం పిచ్‌ను ఆరబెట్టే పనిలో పడ్డారు. బొగ్గు వేడి వల్ల మామూలుగాకంటే చాలా వేగంగా పిచ్ ఆరిపోయి, మ్యాచ్ కోసం అందుబాటులోకి వస్తుందని టీఎన్‌సీఏ నమ్ముతోంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు జరగనుంది. బుధవారం మైదానం తడిగా ఉండటంతో ఇరు జట్లూ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాయి. గురువారం కూడా నెట్ ప్రాక్టీస్ సాధ్యం కాకపోవచ్చు.