ఇంగ్లండ్‌కు ఇరకాటం... భారత్‌కు చెలగాటం | India vs England, ICC Cricket World Cup 2019 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు ఇరకాటం... భారత్‌కు చెలగాటం

Published Sun, Jun 30 2019 3:19 AM | Last Updated on Sun, Jun 30 2019 3:21 AM

India vs England, ICC Cricket World Cup 2019 - Sakshi

ప్రపంచ కప్‌ హాట్‌ ఫేవరెట్‌ ఎవరంటే...? ఠక్కుమని ఇంగ్లండ్‌ అని చెప్పేవారు. ఇదే సమయంలో టీమిండియా సత్తాపై సందేహాలు లేకున్నా ఎలా ఆడుతుందోనన్న అనుమానాలు ఉండేవి. మరిప్పుడు...? ఆతిథ్య దేశం అత్యంత సంక్లిష్ట సందర్భంలో ఉంటే... కోహ్లి సేన జైత్రయాత్రతో సాగిపోతోంది. సెమీ ఫైనల్‌ గడపముంగిట రెండు జట్లూ భిన్నమైన సమీకరణాలతో నిలిచాయి. మరి... నేటి సమరంలో భారత్‌ ఫటాఫట్‌ ఆటతో ముందుకెళ్తుందా? ఇంగ్లండ్‌ తాడోపేడో తేల్చుకుంటుందా?

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌లో ఎదురైన ప్రతి జట్టునూ ఓడిస్తూ అప్రతిహతంగా సాగిపోతున్న టీమిండియాకు తమ శక్తియుక్తులను పరీక్షించుకునే మ్యాచ్‌. జోరుమీదున్న మన జట్టు ఆదివారం ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. వరుస విజయాలతో కోహ్లి సేన నిండైన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుండగా... ఏమాత్రం తేడా వచ్చినా నాకౌట్‌ రేసు నుంచి ఔటయ్యే పరిస్థితి ప్రత్యర్థిది. ప్రధాన పేసర్‌ ఆర్చర్‌ పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడుతున్నా ఆడించేంత క్లిష్టమైన మలుపులో ఉంది ఇంగ్లండ్‌. దీన్నిబట్టే ఆ జట్టు ఎంత ఒత్తిడిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి... మరో విజయంతో టీమిండియా సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంటుందా? అత్యవసరమైన గెలుపుతో ఇంగ్లండ్‌ ఆశలు నిలుపుకొంటుందా? చూడాలి.
 
నాలుగులో అతడిపైనే నమ్మకం!
మిగతా జట్టంతా యథావిధిగా ఉన్నా... టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంపై చర్చకు అంతే ఉండటం లేదు. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ సామర్థ్యంపై సందేహాలే దీనికి కారణం. బ్యాటింగ్‌లో ధాటిగా పరుగులు రాబట్టలేని అతడికి గత రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ అవకాశమూ ఇవ్వలేదు. జట్టులో శంకర్‌ అవసరమా? అనే వాదన వస్తోంది. కానీ, శుక్రవారం కోహ్లి మాటలను బట్టి చూస్తే శంకర్‌కు మరో చాన్స్‌ దక్కేలా కనిపిస్తోంది. అంటే భారత్‌ మార్పుల్లేని జట్టుతోనే బరిలో దిగనుంది. పెద్ద జట్టుతో మ్యాచ్‌ కాబట్టి ధావన్‌ లేని లోటు కనిపించకుండా ఓపెనింగ్‌లో రాహుల్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. హార్దిక్, ధోని, జాదవ్‌ తలో చేయి వేస్తే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు.

పేసర్లకు సరైన సవాల్‌
భారత పేసర్లు బుమ్రా, షమీలకు ఈ మ్యాచ్‌ సరైన సవాల్‌గానే చెప్పాలి. తొలుత భువీ, తర్వాత షమీ తోడుగా బుమ్రా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లను కట్టడి చేసినప్పటికీ ఇంగ్లండ్‌ వాటికి భిన్నం. సొంతగడ్డ అనుకూలతకు తోడు రాయ్, బట్లర్, మోర్గాన్‌ వంటి హార్డ్‌ హిట్టర్లున్న ఆతిథ్య జట్టును ఆపగలిగితే బుమ్రా–షమీ ద్వయానికి ఇక తిరుగుండదనే చెప్పొచ్చు. షమీ బంతులను చూస్తుంటే బుమ్రా మించిన ప్రమాదకారిలా ఉన్నాడు. అయితే, ఏమాత్రం తేడా వచ్చినా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోతారు. కాబట్టి ఎంత ఊపులో ఉన్నా గాడి తప్పకుండా బౌలింగ్‌ చేయడం ముఖ్యం. మరి ఈ సవాలును భారత పేస్‌ ద్వయం ఎలా ఛేదిస్తుందో చూడాలి.

కోహ్లి శతకానికి చకోర పక్షిలా...
రోహిత్, రూట్, వార్నర్, ఫించ్, విలియమ్సన్‌... ఇలా అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ అంతా రెండేసి సెంచరీలు బాదేశారు. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ సైతం రెండుసార్లు 100 మార్కును దాటాడు. వీరందరి కంటే ఓ మెట్టుపైనే ఉండే విరాట్‌ కోహ్లినే ఇంకా శతకాన్ని అందుకోలేదు. టోర్నీలో 19 సెంచరీలు నమోదైనా భారత కెప్టెన్‌ బ్యాట్‌ నుంచి మాత్రం మూడంకెల ఇన్నింగ్స్‌ జాలు వారలేదు. వరుసగా నాలుగు అర్ధ సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి... ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ ముచ్చట తీర్చుకుంటే చూసి తరించాలన్నది అభిమానుల కోరిక.
 
రెచ్చిపో... రోహిత్‌

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌పై అద్భుత శతకాలతో అదరగొట్టిన ఓపెనర్‌ రోహిత్‌... అఫ్గాన్‌పై ఖాతా తెరవలేదు. మంచి టచ్‌లో ఉండగా విండీస్‌పై దురదృష్టవశాత్తు అంపైర్‌ నిర్ణయానికి బలయ్యాడు. ఇప్పుడు అతడు మళ్లీ చెలరేగాల్సిన సమయం వచ్చింది. ఆర్చర్, వుడ్, వోక్స్‌లను రోహిత్‌ భారీ షాట్లతో దంచేస్తే అవతలి ఎండ్‌లో రాహుల్‌ సమయోచితంగా ఆడే వీలుంటుంది. తద్వారా కోహ్లిపైనా భారం తగ్గుతుంది. ఈ త్రయం అటుఇటుగా 40 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే... ఆస్ట్రేలియాపై తరహాలోనే హార్దిక్‌ను ముందు పంపి స్కోరును అమాంతం పెంచుకోవచ్చు.

ఇంగ్లండ్‌ ఎలానో?
వరుసగా రెండు పరాజయాలు... అందులోనూ శ్రీలంక చేతిలోనూ ఓటమితో ఇంగ్లండ్‌ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. కండరాల గాయంతో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ దూరమవడంతో జట్టు సాధారణంగా మారిపోయింది. రూట్‌ నిలకడ చూపుతున్నా మోర్గాన్, బట్లర్‌ కీలక సమయంలో విఫలమవడం దెబ్బకొట్టింది. మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. రాయ్‌ పునరాగమనంతో ఆతిథ్య జట్టుకు ఊపిరి వచ్చినట్లైంది. ప్రస్తుతానికి వారికి ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఫామ్‌ ఒక్కటే ఊరట. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా పేస్‌ ద్వయం, మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను ఎలా కాచుకుంటారన్నది ఆసక్తికరం. పేసర్లు ఆర్చర్, వుడ్‌ భారత టాపార్డర్‌ను త్వరగా ఔట్‌ చేస్తేనే జట్టుకు ప్రయోజనం. వీరుగనుక కోహ్లి బృందాన్ని నిలువరించలేకపోతే స్టోక్స్‌ సహా స్పిన్నర్లు రషీద్, మొయిన్‌ అలీ చేసేందుకు ఏమీ ఉండదు.

1992 నుంచి మనకు ఓటమే లేదు
ప్రపంచ కప్‌లో చివరిసారిగా ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ 1992లో ఓడింది. 1996, 2007, 2015 కప్‌లలో రెండు జట్లు ఎదురుపడలేదు. 1999లో ఇంగ్లండ్‌ను సొంతగడ్డపైనే టీమిండియా ఓడించింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2003లో మనదే పైచేయి. అయితే, 2011లో భారత్‌ వేదికగా జరిగిన కప్‌లో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ సమం చేసి ఔరా అనిపించింది.

కొట్టినోడే బాల్‌ తీసుకు రావాలి!
భారత జట్టు ప్రాక్టీస్‌లో ధోని ‘గల్లీ క్రికెట్‌ రూల్‌’ను పాటించాడు. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో సాధన చేస్తున్న సమయంలో అతను కొట్టిన షాట్‌కు బంతి వెళ్లి దగ్గరలో ఉన్న పొదల్లో పడింది. మాజీ కెప్టెన్‌ చెట్లలోకి వెళ్లి వెతికి మరీ బంతిని బయటకు తీసుకు రావడం విశేషం!   

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్, రాహుల్, కోహ్లి (కెప్టెన్‌), విజయ్, ధోని, జాదవ్, పాండ్యా, చహల్, కుల్దీప్, షమీ, బుమ్రా.
ఇంగ్లండ్‌: రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్‌ (కెప్టెన్‌), బట్లర్, స్టోక్స్, అలీ, రషీద్, ఆర్చర్, వోక్స్, వుడ్‌.

ముఖాముఖి రికార్డు
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు జరగ్గా భారత్‌ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 41 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. రెండు టై కాగా,  మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో భాగంగా ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా చెరో మూడింట్లో నెగ్గాయి. ఒకటి ‘టై’గా ముగిసింది.

పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు వేదికైన ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం పిచ్‌ టోర్నీలోనే బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలమైనదిగా చెబుతున్నారు. ఇరు జట్ల సామర్థ్యాన్ని బట్టి చేస్తే భారీ స్కోర్లు ఖాయం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.  

ఎన్‌సీఏకు ద్రవిడ్‌ నేతృత్వం
భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో గురుతర బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అతను ‘హెడ్‌’గా వ్యవహరిస్తాడు. జూలై 1నుంచి ద్రవిడ్‌ తన కొత్త పాత్రలోకి ప్రవేశిస్తాడు. తన విధుల్లో భాగంగా అతను ఇక్కడ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశనం చేస్తాడు. జూనియర్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను రూపొందించడంతో పాటు మహిళా క్రికెటర్లను తీర్చిదిద్దడం కూడా అతని విధుల్లో భాగంగా ఉంటాయి. ద్రవిడ్‌ ఇప్పటికే భారత ‘ఎ’, అండర్‌–19 టీమ్‌లకు కోచ్‌గా పని చేస్తున్నాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement