తగిలింది తొలి షాక్‌ | WORLD CUP ENGLAND BEAT INDIA 31 RUNS | Sakshi
Sakshi News home page

తగిలింది తొలి షాక్‌

Published Mon, Jul 1 2019 4:48 AM | Last Updated on Wed, Jul 3 2019 7:04 PM

WORLD CUP ENGLAND BEAT INDIA 31 RUNS - Sakshi

భారత్‌కు ఝలక్‌ ఇస్తూ... ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. నాకౌట్‌ బెర్త్‌ ఉత్కంఠను సగం తగ్గించుకుంది. ఫ్లాట్‌ పిచ్‌ ఎదురైతే, అందునా ముందు బ్యాటింగ్‌కు దిగితే తామెంత భీకరంగా ఆడతామో చూపుతూ చెలరేగిన ఆతిథ్య జట్టు... మెగా టోర్నీలో కోహ్లి సేనకు తొలి ఓటమి రుచి చూపింది. అంతమాత్రాన భారత్‌ తేలిగ్గా ఏమీ లొంగలేదు. తొలుత వెనుకబడ్డా బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో పుంజుకుని ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. చివర్లో పైచేయి సాధించలేక విజయానికి దూరమైంది.

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌లో భారత్‌ అప్రతిహత విజయాలకు ఇంగ్లండ్‌ గండి కొట్టింది. సెమీఫైనల్స్‌ చేరాలంటే గెలుపు తప్పనిసరైన స్థితిలో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 31 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జానీ బెయిర్‌స్టో (109 బంతుల్లో 111; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (57 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు); ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (54 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. మొహమ్మద్‌ షమీ (5/69) మరోసారి చక్కటి బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్‌ బుమ్రా (1/44) పొదుపుగా బంతులేశాడు.

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) శతకంతో అదరగొట్టినా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (76 బంతుల్లో 66; 7 ఫోర్లు) రాణించినా, హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరిసినా... టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వెటరన్‌ ధోని (31 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), కేదార్‌ జాదవ్‌ (13 బంతుల్లో 12 నాటౌట్‌)లు చివరి 31 బంతుల్లో 39 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులే చేయగలిగింది. ప్లంకెట్‌ (3/55); వోక్స్‌ (2/58) వికెట్లు తీయగా, ఆర్చర్‌ (0/45) కీలక సమయంలో పరుగులు అడ్డుకున్నాడు. టోర్నీలో భారత్‌కిది తొలి ఓటమి. మంగళవారం ఇదే వేదికపై బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

ఇతడు వచ్చాడు... అతడు దంచాడు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 160 పరుగులు జోడించిన ఓపెనర్ల ఆటే హైలైట్‌. ముందు రాయ్, తర్వాత బెయిర్‌స్టో దూకుడు చూపి అద్భుత ఆరంభం ఇచ్చారు. టోర్నీలో అంచనాకు తగ్గట్లు ఆడని బెయిర్‌స్టో ఈ ఇన్నింగ్స్‌తో సత్తా చాటగా, గత మూడు మ్యాచ్‌లకు దూరమైన రాయ్‌ పునరాగమనంలో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తన ప్రభావమెంతో చాటాడు. షమీ వేసిన మొదటి ఓవర్లోనే అతడు రెండు ఫోర్లు బాదాడు. చహల్‌ను ఆరో ఓవర్లోనే దింపడం ఈ ద్వయం పని తేలిక చేసింది. బెదురు లేని రాయ్‌ ఆటతో స్ఫూర్తి పొందిన బెయిర్‌స్టో జోరు పెంచి 56 బంతుల్లో అర్ధ సెంచరీని చేరుకున్నాడు.

41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాయ్‌ను కుల్దీప్‌ ఔట్‌ చేశాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లు బాదిన బెయిర్‌స్టో 90 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతడితో పాటు కెప్టెన్‌ మోర్గాన్‌ (1)ను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి ప్రత్యర్థికి షమీ కళ్లెం వేశాడు. రూట్‌ (54 బంతుల్లో 44; 2 ఫోర్లు) వేగంగా ఆడలేకపోవడం, స్టోక్స్‌ కుదురుకోవాలని చూడటంతో ఇంగ్లండ్‌ రన్‌ రేట్‌ 6కు పడిపోయింది. అయితే, చహల్‌ వేసిన 40వ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో స్టోక్స్‌ మళ్లీ పైకి లేపాడు. 38 బంతుల్లో అతడి అర్ధసెంచరీ పూర్తయింది. రూట్, బట్లర్‌ (8 బంతుల్లో 20; ఫోర్, 2 సిక్స్‌లు), వోక్స్‌ (7)లను షమీ పెవిలియన్‌ బాట పట్టించినా, దూకుడు తగ్గించని స్టోక్స్‌ భారీ షాట్లతో జటుకు తగిన స్కోరు అందించాడు.

తట్టుకుని నిలిచారు...
వోక్స్‌ తొలి ఓవర్‌ను మెయిడిన్‌ ఆడిన రాహుల్‌ (0) అతడి తర్వాతి ఓవర్లో మూడు బంతులను ఎదుర్కొని ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ దశలో వోక్స్, ఆర్చర్‌ అన్ని అస్త్రాలతో రోహిత్‌–కోహ్లిలను పరీక్షించారు. ఆర్చర్‌ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద రోహిత్‌ క్యాచ్‌ను రెండో స్లిప్‌లో రూట్‌ చేజార్చడం మనకు కలిసొచ్చింది. ఈ జోడీ సాహసాలకు పోకుండా ఆడటంతో భారత్‌ టోర్నీలోనే అత్యంత తక్కువ పవర్‌ ప్లే స్కోరు (28/1) నమోదు చేసింది. వుడ్, ప్లంకెట్‌ దిగాక బౌండరీలు బాదుతూ వీరు గేర్‌ మార్చారు. 59 బంతుల్లో కోహ్లి, 65 బంతుల్లో రోహిత్‌ అర్ధశతకం మార్కును చేరుకున్నారు. స్టోక్స్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లతో రోహిత్‌ టాప్‌ గేర్‌లోకి వచ్చాడు.

ప్లంకెట్‌ బౌలింగ్‌లో కోహ్లి ఔటవడంతో 138 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. పంత్‌ (29 బంతుల్లో 32; 4 ఫోర్లు) తోడుగా కప్‌లో రోహిత్‌ మూడో శతకం (106 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లలో 140 పరుగులు అవసరమైన దశలో ఇక చెలరేగిపోతాడని భావిస్తుండగా అతడిని... వోక్స్‌ స్లో బంతితో బోల్తా కొట్టించాడు. సమీకరణం 12 ఓవర్లలో 128గా ఉండగా వోక్స్‌ ఓవర్లో హార్దిక్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు సహా 16 పరుగులు రాబట్టి ఆశలు రేపాడు. ఆ వెంటనే ప్లంకెట్‌ బౌలింగ్‌లో పంత్‌ కొట్టిన షాట్‌ను స్వే్కర్‌లెగ్‌ వద్ద వోక్స్‌ ముందుకు దూకుతూ అందుకుని మలుపు తిప్పా డు. రన్‌రేట్‌ పెరుగుతూ పోతుండగా భారీ షాట్‌కు యత్నించి హార్దిక్‌ ఔట య్యాడు. ధోని, జాదవ్‌ బ్యాటింగ్‌æ తీరుతో ఓటమి ఖరారైంది.

టాస్‌ చేజారింది... కూర్పు దెబ్బకొట్టింది
మ్యాచ్‌లో టీమిండియాకు టాస్‌ రూపంలో అదృష్టం కలిసిరాలేదు. ఫ్లాట్‌ పిచ్‌పై టాస్‌ నెగ్గిన మోర్గాన్‌ ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ కూర్పులోనూ పొరపాటు చేసింది. ఇంగ్లండ్‌ పిచ్‌కు తగ్గట్లుగా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని పక్కనపెట్టి పేసర్‌ ప్లంకెట్‌ను తీసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తద్వారా ఐదుగురు స్పెషలిస్ట్‌ (నలుగురు పేసర్లు వోక్స్, వుడ్, ప్లంకెట్, ఆర్చర్‌ +స్పిన్నర్‌ రషీద్‌) బౌలర్లతో బరిలో దిగినట్లైంది. భారత్‌ మాత్రం స్పిన్నర్‌ను తగ్గించుకుని పేసర్‌ భువనేశ్వర్‌ను ఆడించే ఆలోచన చేయలేదు. పైగా తుది జట్టులో ఉంటాడని ముందు రోజే స్పష్టమైన పేస్‌ ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను అనూహ్యంగా తప్పించి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు చోటిచ్చింది.
మ్యాచ్‌లో మన ప్రధాన పేసర్లు బుమ్రా, షమీ తమ పూర్తి కోటాలో 113 పరుగులిచ్చి 6 వికెట్లు తీస్తే స్పిన్‌ ద్వయం చహల్‌ (0/88), కుల్దీప్‌ (1/72) ఏకంగా 160 పరుగులు సమర్పించుకుని ఒక వికెటే పడగొట్టగలిగారు. వీరిని అలవోకగా ఎదుర్కొన్న ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ పరుగుల పండుగ చేసుకున్నారు. అంతగా ఫామ్‌లో లేని బెయిర్‌స్టో ఇదే అదనుగా సిక్స్‌లతో చెలరేగిపోయాడు. దీన్నిచూసి కోహ్లి... పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జాదవ్‌కు బంతి ఇవ్వనేలేదు. ఈ నేపథ్యంలో శంకర్‌ ఉండి ఉంటే అతడి మీడియం పేస్‌ కొంతైనా ఉపయోగపడేది. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గణాంకాలు (0/60) పరిశీలించినా మూడో పేసర్‌గా భువీని ఆడించి ఉండాల్సిందని స్పష్టమవుతుంది.

1: వన్డేల్లో 25 సెంచరీలు చేసిన రోహిత్‌ ఒక్క సిక్స్‌ కొట్టకుండా శతకం చేయడం ఇదే ప్రథమం.
2:  ఒకే ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు చేసిన రెండో భారత క్రికెటర్‌ రోహిత్‌. గంగూలీ (2003లో) కూడా మూడు సెంచరీలు చేశాడు.
6: ప్రపంచకప్‌లోని ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌ షమీ. గతంలో కపిల్‌ (1983), రాబిన్‌ సింగ్‌ (1999), వెంకటేశ్‌ ప్రసాద్‌ (1999), ఆశిష్‌ నెహ్రా (2003), యువరాజ్‌ సింగ్‌ (2011) ఈ ఘనత సాధించారు.  
2: ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలో గంగూలీ సరసన రోహిత్‌ (4 చొప్పున) నిలిచాడు. సచిన్‌ (6) ముందున్నాడు.
1: ఒకే ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలు చేసిన తొలి కెప్టెన్‌ కోహ్లి.
1:  భారత్‌ తరఫున ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చహల్‌ నిలిచాడు. శ్రీనాథ్‌ (87; 2003లో ఆస్ట్రేలియాపై)ను చహల్‌ వెనక్కి నెట్టాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) సబ్‌ (జడేజా) (బి) కుల్దీప్‌ 66; బెయిర్‌స్టో (సి) పంత్‌ (బి) షమీ 111; రూట్‌ (సి) పాండ్యా (బి) షమీ 44; మోర్గాన్‌ (సి) జాదవ్‌ (బి) షమీ 1; స్టోక్స్‌ (సి) సబ్‌ (జడేజా) (బి) బుమ్రా 79; బట్లర్‌ (సి అండ్‌ బి) షమీ 20; వోక్స్‌ (సి) రోహిత్‌ (బి) షమీ 7; ప్లంకెట్‌ (నాటౌట్‌) 1; ఆర్చర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 337.

వికెట్ల పతనం: 1–160, 2–205, 3–207, 4–277, 5–310, 6–319, 7–336.

బౌలింగ్‌: షమీ 10–1–69–5, బుమ్రా 10–1–44–1, చహల్‌ 10–0–88–0, హార్దిక్‌ 10–0–60–0, కుల్దీప్‌ 10–0–72–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి అండ్‌ బి) వోక్స్‌ 0; రోహిత్‌ శర్మ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 102; కోహ్లి (సి) సబ్‌ (విన్స్‌) (బి) ప్లంకెట్‌ 66; పంత్‌ (సి) వోక్స్‌ (బి) ప్లంకెట్‌ 32; హార్దిక్‌ పాండ్యా (సి) సబ్‌ (విన్స్‌) (బి) ప్లంకెట్‌ 45; ధోని (నాటౌట్‌) 42; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 306.

వికెట్ల పతనం: 1–8, 2–146, 3–198, 4–226, 5–267.

బౌలింగ్‌: వోక్స్‌ 10–3–58–2, ఆర్చర్‌ 10–0– 45–0, ప్లంకెట్‌ 10–0–55–3, మార్క్‌ వుడ్‌ 10–0–73–0, రషీద్‌ 6–0–40–0, స్టోక్స్‌ 4–0–34–0.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement