
పాక్‌తో సిరీస్ గురించి త్వరలో చెబుతాం
బీసీసీఐ ప్రకటన
మేమైతే భారత్‌కు రాము: పీసీబీ
న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు ఎట్టి పరిస్థితిలోనూ వచ్చేది లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. మరోవైపు భద్రతా కారణాలరీత్యా తమ జట్టు భారత్‌లో పర్యటించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వాస్తవానికి ఇది పాక్ హోం సిరీస్ కాబట్టి యూఏఈలో జరగాల్సి ఉన్నా అక్కడికి వెళ్లేందుకు భారత్ ఆసక్తి చూపడం లేదు. ‘మా ప్రభుత్వ అనుమతి లేకుండా భారత్‌కు వెళ్లి ఆడలేం. అక్కడ మా జట్టు భద్రతపై ప్రభుత్వం ఆందోళన వెలిబుచ్చింది. యూఏఈలో ఇంతకుముందు ఐపీఎల్ జరిగింది. ఇప్పుడు అక్కడ ఆడేందుకు బీసీసీఐ ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావడం లేదు’ అని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నజమ్ సేథీ తెలిపారు.
ముంబై: వచ్చే నెలలో జరగాల్సిన భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌పై ఓ స్పష్టత వచ్చేందుకు అభిమానులు మరి కొద్ది రోజులు వేచి చూడాలని బీసీసీఐ పేర్కొంటోంది. ‘పాక్‌తో సిరీస్ ఉంటుందా? లేదా? అనే విషయంపై మరో నాలుగైదు రోజులు వేచి చూడండి’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. ఇదిలావుండగా బోర్డు సభ్యుల కార్యకలాపాలపై రహస్యంగా విచారించేందుకు గత పాలకులు బ్రిటిష్ ఏజెన్సీని నియమించుకున్నారనే ఆరోపణలపై ఇద్దరు సభ్యల కమిటీ విచారణ ప్రారంభించింది. ‘అజయ్ షిర్కే, గోకరాజు గంగరాజులతో కూడిన కమిటీ గురువారం సంజయ్ పటేల్, అనిరుధ్ చౌధురిని కలిసి కొన్ని వివరాలు అడిగారు. సమాధానం ఇచ్చేందుకు కొంత సమయమివ్వాలని వారు కోరారు. ఈ విచారణ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది’ అని ఠాకూర్ అన్నారు.
‘చెన్నై వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’
ఐసీసీ టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో చెన్నైలోని చిదంబరం స్టేడియంపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ‘ఈ అంశంపై పూర్తిగా చర్చించాం. ఆ స్టేడియం విషయంలో కొన్ని సమస్యలున్నాయి. లంక ఆటగాళ్లు అక్కడ ఆడలేరు. మూడు స్టాండ్స్‌కు అనుమతి లేదు. ఇవి పరిష్కారం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే ఆ వేదికను తప్పించలేదు’ అని ఠాకూర్ తెలిపారు.