119 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో భారత్ స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 117/1... మరో 2 పరుగులు చేస్తే చాలు గెలుపు సొంతమవుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. ధావన్ స్టాన్స్ తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ అంపైర్లు ఒక్కసారిగా ‘లంచ్’ అని ప్రకటించేశారు. దాంతో కోహ్లి, దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారిద్దరు అంపైర్లతో ఏదో చెప్పబోయినా రూల్స్ అంటే రూల్స్ అంటూ వారు తిరస్కరించడంతో చేసేదేమీ లేక ఆటగాళ్లు మైదానం వీడారు.
దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. రిఫరీ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోకుండా రాతియుగం లాంటి నిబంధనలు అమలు చేయడం ఏమిటని మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు విరుచుకు పడ్డారు. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించడం... దక్షిణాఫ్రికా ఓటమి ఖాయం కావడంతో మరో రెండు పరుగుల కోసం వేచి చూడకుండా ప్రేక్షకులు మైదానం వీడటం కనిపించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కేవలం 32.2 ఓవర్లకే ముగియడంతో భారత్ ఆడే సమయంలో లంచ్ విరామం ప్రకటించాల్సింది.
15 ఓవర్లు ముగిశాక మరో 26 పరుగులు చేయాల్సిన సమయంలోనే లంచ్ సమయం అయింది. నిజానికి ఈ సమయంలోనే బ్రేక్ ఇస్తే ఇంతగా విమర్శలు రాకపోయేవేమో! అయితే అంపైర్లు ఫలితాన్ని ఆశిస్తూ మరో 15 నిమిషాలు పొడిగించారు. ఆపై 4 ఓవర్లలో భారత్ 24 పరుగులు చేయగలిగింది. దాంతో మరో మాటకు తావు లేకుండా ఆటను నిలిపేశారు. 45 నిమిషాల విరామం తర్వాత వచ్చీ రాగానే భారత్ గెలవలేదు. షమ్సీ వేసిన 20వ ఓవర్‌లో ధావన్ పరుగులేమీ చేయకపోవడంతో అది ‘మెయిడిన్’ అయింది. ఆ తర్వాత తాహిర్ ఓవర్ మూడో బంతికి కోహ్లి రెండు పరుగులు తీసి లాంఛనం పూర్తి చేశాడు.
5/22 చహల్ కెరీర్ అత్యుత్తమ బౌలింగ్. తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టిన చహల్... దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 1999లో సునీల్ జోషి (5/6) ప్రదర్శన మొదటి స్థానంలో ఉంది.
118 సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. 2009లో ఆ జట్టు ఇంగ్లండ్‌పై 119 పరుగులు చేసింది.
9 తొమ్మిదేళ్ల తర్వాత తుది జట్టులో డు ప్లెసిస్, డివిలియర్స్ లేకుండా దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆడింది.
లంచ్ ప్రకటించక ముందు నిండుగా...
ప్రకటించాక ఖాళీగా...
Comments
Please login to add a commentAdd a comment