పూర్తి ఆధిపత్యం | India vs South Africa: Murali Vijay, Cheteshwar Pujara make merry at Durban | Sakshi
Sakshi News home page

పూర్తి ఆధిపత్యం

Published Fri, Dec 27 2013 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

మురళీ విజయ్ , చతేశ్వర్ పుజారా

మురళీ విజయ్ , చతేశ్వర్ పుజారా

 రెండో రోజు ఆట మధ్యాహ్నం గం. 1 నుంచి టెన్ క్రికెట్‌లో
 ప్రత్యక్ష ప్రసారం
 
 సఫారీ పేసర్లు మరోసారి తేలిపోయారు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇబ్బందిపెట్టలేక రెండో టెస్టులోనూ చతికిలపడ్డారు. ధావన్ విఫలమైనా... ఫామ్‌లోకి వచ్చిన విజయ్, పుజారాతో కలిసి పరుగుల వరద పారించాడు. దీంతో తొలి రోజు ధోనిసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.... రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసిన ప్రొటీస్ బౌలర్లు కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్నారు.
 
 డర్బన్: తొలి టెస్టు ఇచ్చిన ఆత్మ విశ్వాసాన్ని భారత కుర్రాళ్లు బాక్సింగ్ డే (రెండో) టెస్టులోనూ కొనసాగించారు. ప్రొటీస్ పేసర్ల మెరుపులను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు.
 
 
  దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్ ధావన్ (49 బంతుల్లో 29; 4 ఫోర్లు) విఫలమైనా... ఫామ్‌తో ఇబ్బందుపడుతున్న మురళీ విజయ్ (201 బంతుల్లో 91 బ్యాటింగ్; 17 ఫోర్లు) గాడిలో పడ్డాడు. వాండరర్స్ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (117 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
 
 విజయ్, పుజారా రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో వికెట్ నష్టానికి 181 పరుగులు చేసింది. విజయ్, పుజారా క్రీజులో ఉన్నారు. బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్‌ను ముందుగా ఆపేశారు. దీంతో రెండో రోజు ఆట షెడ్యూల్ సమయాని కంటే అరగంట ముందు ప్రారంభమవుతుంది.
 
 కింగ్స్‌మీడ్ మైదానంలో మొదలైన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి.  అశ్విన్ స్థానంలో జడేజా భారత జట్టులోకి రాగా, తాహిర్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్‌కు సఫారీ తుది జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టులో గాయపడిన మోర్నీ మోర్కెల్ ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న కలిస్ ఫీల్డ్‌లోకి ముందు రాగా మిగతా జట్టు అతన్ని అనుసరించింది. టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  
 
 ధావన్ విఫలం
 ఎదుర్కొన్న రెండో బంతికి ఫోర్ కొట్టిన ధావన్ దూకుడును కనబరిస్తే... రెండో ఎండ్‌లో విజయ్ నిలకడగా ఆడాడు. తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాబట్టిన ఈ జోడి నిలకడగా ఆడింది. స్టెయిన్, ఫిలాండర్ స్వింగ్ కోసం ప్రయత్నించినా... వికెట్ ఫ్లాట్‌గా ఉండటంతో బౌన్స్‌కు అనుకూలించింది. 8వ ఓవర్‌లోనే మోర్కెల్‌ను దించినా భారత ద్వయం మాత్రం బెదరలేదు.
 
 చూడచక్కని షాట్లతో అలరిస్తూ తొలి 13 ఓవర్లలో 41 పరుగులు రాబట్టింది. ఇక క్రీజులో కుదురుకున్నారనుకున్న దశలో మోర్కెల్ వేసిన అవుట్ స్వింగర్‌ను ఆడబోయి థర్డ్ స్లిప్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన పుజారా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. అయితే ఒత్తిడి పెంచేందుకు 16వ ఓవర్‌లో కలిస్‌ను, 22వ ఓవర్‌లో స్పిన్నర్ పీటర్సన్‌ను బరిలోకి దించినా భారత ఆటగాళ్లు స్ట్రయిక్‌ను రొటేట్ చేసుకుంటూ వెళ్లారు. పుజారా నెమ్మదించినా... విజయ్ మాత్రం కలిస్, పీటర్సన్ బౌలింగ్‌లో బౌండరీలు బాదాడు. దీంతో ఈ సెషన్ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన ఈ జోడి 76/1 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
 
 విజయ్ హవా
 లంచ్ తర్వాత వాతావరణం మేఘావృతమైనా... ప్రొటీస్ పేసర్లు మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో విజయ్ బౌండరీలతో స్కోరు బోర్డును పరిగెత్తిస్తే... పుజారా సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు.
 
 
 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కలిస్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన విజయ్ 102 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా నిలకడగా ఆడిన ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ స్మిత్... తరచూ పేసర్లను మార్చినా ఫలితం లేకపోయింది. లంచ్ తర్వాత తొలి గంటలో భారత్ 13 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఫిలాండర్ బౌలింగ్‌లో వరుసగా రెండు అద్భుతమైన షాట్లతో చెలరేగిన విజయ్ 100 పరుగుల భాగస్వామ్యాన్నీ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో భారత్ కూడా 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. పీటర్సన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన పుజారా 97 బంతుల్లో అర్ధసెంచరీని సాధించాడు. ఈ సెషన్ మొత్తం భారత్ ఆధిపత్యం కొనసాగింది.
 
 ఆగిపోయిన మ్యాచ్
 టీ తర్వాత వచ్చీ రావడంతోనే పీటర్సన్ బౌలింగ్‌లో విజయ్ ఎదురుదాడికి దిగాడు. రెండు ఓవర్లలో మూడు బౌండరీలు కొట్టి 90 పరుగులకు చేరుకున్నాడు. పుజారా కూడా విజయ్‌కే ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు. రెండో ఎండ్‌లో స్టెయిన్‌ను కొనసాగించడంతో భారత ద్వయం ఆచితూచి ఆడింది. చివరకు 61వ ఓవర్ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ను ఆపేశారు.  
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) మోర్కెల్ 29; విజయ్ బ్యాటింగ్ 91; పుజారా బ్యాటింగ్ 58; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 1, వైడ్లు 1, నోబాల్స్ 1) 3; మొత్తం: (61 ఓవర్లలో వికెట్ నష్టానికి) 181.
 
 వికెట్లపతనం: 1-41
 బౌలింగ్: స్టెయిన్ 16-6-49-0; ఫిలాండర్ 14-4-39-0; మోర్కెల్ 12-3-26-1; కలిస్ 7-1-23-0; పీటర్సన్ 12-2-43-0.
 
 వాతావరణం అనుకూలిస్తుందా?
 రెండో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఇదే జోరును కొనసాగిస్తే మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ మ్యాచ్  పూర్తిగా జరుగుతుందా అనేది అనుమానమే. ఆటకు చివరి రెండు రోజులు (ఆది, సోమ) వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదిక. డర్బన్‌లో బ్యాడ్‌లైట్ మామూలే. ఈ నేపథ్యంలో అరగంట ముందుగా ఆట ప్రారంభించినా ఎన్ని ఓవర్లు మేకప్ చేయగలరనేది పెద్ద ప్రశ్న.
 
 సెషన్-1
 ఓవర్లు:    26
 పరుగులు: 76
 వికెట్లు:    1
 
 సెషన్-2
 ఓవర్లు:    27
 పరుగులు: 87
 వికెట్లు:    0
 
 సెషన్-3
 ఓవర్లు:    8
 పరుగులు: 18
 వికెట్లు:    0
 

1 భారత్ తరఫున వేగంగా 1500 పరుగులు (27 ఇన్నింగ్స్) చేసిన క్రికెటర్‌గా పుజారా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement